Saturday, November 16, 2024

మండుటెండల్లో మానేరు పరవళ్లు

హైదరాబాద్‌, : మండుటెండల్లో మానేరు పరవళ్లు తొక్కనుంది. నిండుజలాలతో కనువిందు చేయనుంది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశాలతో మండుటెండల్లో మానేరుకు గోదావరి జలాలు గలగలా పరుగెత్తుకుంటూ రానున్నాయి. కొండపోచమ్మ కెనాల్‌ నుంచి కూడెల్లి వాగులోకి విడుదల చేసిన నీటిని పూర్తి సామర్థ్యంలో వదలాలని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి-10 ఈఎన్సీ హరేరాంని మంత్రి కేటీఆర్‌ ఆదివారం ఆదేశించారు. తద్వారా సిరిసిల్ల నియోజక వర్గానికి కల్పతరువు అయిన ఎగువమానేరుకు గోదావరి జలాలు అందుతాయని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు ఇరిగేషన్‌ అధికారులు 800ల క్యూసెక్కుల ప్రవాహాన్ని 1300లకు పెంచారు. నీటి ప్రవాహం పెంపుతో కూడెల్లివాగులో ప్రవాహం వేగం పుంజుకుంది. దీంతో మరో రెండు రోజుల్లో గోదావరి జలాలు నర్మాల ప్రాజెక్టులోకి చేరనున్నాయి. కూడెల్లివాగులోని 29 చెక్‌ డ్యాములకు గాను ఇప్పటికే 26 చెక్‌ డ్యాములు నిండి గోదావరి జలాలు ఎగువ మానేరుకు సమీపంలోకి ప్రవహిస్తున్నాయి.
రెండు రోజుల్లో మానేరు కళకళ
మరో రెండు రోజుల్లో మానేరుకు గోదావరి జలాలు చేరనున్నాయి. ఇదే ప్రవాహం ఇట్లనే కొనసాగితే మండుటెండల్లో అప్పర్‌ మానేరు నిండుకుండలా మారి పరవళ్లు తొక్కనుంది. సిరిసిల్ల నియోజక వర్గానికి కల్పతరువుగా ఉన్న ఎగువమానేరుకు నీళ్లు రానుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడెల్లివాగు నీటిప్రవాహాన్ని తెలుసుకుంటూ సంతోషపడుతు న్నారు. మంత్రి కేటీఆర్‌ చొరవ పట్ల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement