Saturday, November 23, 2024

మే 1నుంచి తెలంగాణలో అంద‌రికీ ఉచిత టీకా?

హైదరాబాద్‌, : కరోనా వ్యాక్సిన్‌ను ఫ్రీగా అందించేందుకు పలు రాష్ట్రాలు ముందుకు వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఉచితంగా అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. మే 1 నుంచి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మరింత వేగవంతం కానుండగా, ఇప్పటివరకు తెలంగాణకు పంపిన వ్యాక్సిన్‌ డోసులపై అసంతృప్తితో ఉంది. వివిధ రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సిన్‌ తయారీ సంస్థల నుంచి పెద్దఎత్తున వ్యాక్సిన్‌ కొనుగోలు చేస్తున్నాయి. వ్యాక్సిన్‌ రాజధానిగా హైదరాబాద్‌కు పేరుండగా, పంపిణీని ఇంతకాలం కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇపుడు ఎవరైనా నేరుగా వ్యాక్సిన్‌ కొనుగోలు చేయవచ్చని చెప్పడంతో.. అందుకు తగ్గట్లుగా తెలంగాణ ప్రభుత్వం సన్నద్దమవుతోంది. ఫ్రీ వ్యాక్సిన్‌ అందించే విషయంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, 45 ఏళ్లు దాటిన వారికి ఫ్రీ వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఫ్రీ వ్యాక్సిన్‌ అందిస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్‌ అందించేందుకు అనుమతులు మంజూరు కావడంతో దీనిపై ప్రభుత్వం చర్చిస్తోంది. కేంద్రానికి 150రూపాయలు, రాష్ట్రాలకు 400రూ.లుగా వ్యాక్సిన్‌ ధర నిర్ణయించడంపై మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకే దేశం రెండు ధరలు అంటూ.. భగభగలాడారు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్‌ చేస్తే.. ఎంత బడ్జెట్‌ అవుతుందన్న అంశంపై కసరత్తులు చేస్తోంది. ప్రభుత్వంలో ఫ్రీ, ప్రైవేట్‌లో ప్రజల ఇష్టానికి వదిలేసే విధంగా ప్రతిపాదనలు అందగా, దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. హైదరాబాద్‌లో ఉన్న ఉత్పత్తి కంపెనీలతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడి.. దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement