Saturday, November 23, 2024

కేంద్ర ప్ర‌భుత్వం చేతులెత్తేస్తే… ఉచిత టీకాకు తెలంగాణ ప్ర‌భుత్వం రెడీ…

హైదరాబాద్‌, తెలంగాణ ప్రజలపై భారం పడకుండా.. వ్యాక్సిన్‌ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం తమవల్ల కాదని చేతులెత్తేస్తే.. అపుడు నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్‌ అందించేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా, పలు రాష్ట్రాలు ఫ్రీ వ్యాక్సిన్‌ అందిస్తామని ప్రకటించాయి. వ్యాక్సిన్‌ కోసం కేంద్రప్రభుత్వం బడ్జెట్‌లో పెట్టిన రూ.35వేల కోట్లు ఎటు వెళ్ళాయి.. కేంద్రానికో రేటు.. రాష్ట్రానికో రేటు ఏంటి అని ప్రశ్నలు సంధిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కేంద్రం తీరును ఎండగడుతోంది. కేంద్రానికి బాధ్యత లేదా.. ప్రజలంటే రాష్ట్రాలకే సంబంధమా.. ఇక్కడి ప్రజల పన్నుల ఆదాయం కేంద్రం తీసుకోవడంలేదా? ఇంతపెద్ద విపత్తు విషయంలోనే బాధ్యతలేకుంటే ఎలా? అని తెలంగాణ ధుమ ధుమలాడుతోంది. ప్రజలకు సాయంచేసే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉదారంగా వ్యవహరిస్తారన్న పేరుంది. వ్యాక్సిన్‌ విషయంలో ఇంతకాలం పెత్తనం చేసిన కేంద్రం రాష్ట్రాలమీద భారం మోపేలా వ్యవహరించడంపై ఆగ్రహంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, 45 ఏళ్లు దాటిన వారికి ఫ్రీ వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. కేంద్రానికి 150రూపాయలు, రాష్ట్రాలకు 400రూ.లుగా వ్యాక్సిన్‌ ధర నిర్ణయించడంపై మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా రాష్ట్రంలో దాదాపు 1.5కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్‌ అవసరం ఉండనుండగా, ఇందుకోసం దాదాపు వేయికోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఎంతయినా.. వెచ్చించేందుకు సిద్దంగా ఉందని, అయితే కేంద్రం ఈ విషయంలో ఉదారంగా వ్యవహరించాలని రాష్ట్రం కోరుతోంది.
ప్రజలపై పైసా భారం పడనీయం: మంత్రి ఈటల రాజేందర్‌
వ్యాక్సిన్‌ విషయంలో ప్రజలపై భారం పడనీయబోమని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత మానవీయంగా ఉదారంగా వ్యవహరిస్తుందన్న విషయం దేశం మొత్తానికి తెలుసునని ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం రాత్రి ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్‌ ఎంత మానవీయంగా వ్యవహరించి ప్రజలను కాపాడుకుంటారో అందరికీ తెలుసునన్నారు. కేంద్రం ఉచిత వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్దంగా లేకపోతే.. రాష్ట్ర ప్రజలను కాపాడుకుంటామని, ప్రజలపై భారాలు పడుతుంటే చూస్తూ ఊరుకునే ప్రభుత్వంకాదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా మందులకొరత లేదని, ఇపుడు రెండవ డోస్‌ వ్యాక్సిన్‌కు కొరత ఏర్పడుతున్నదని, దీనిని అధిగమించే ప్రయత్నం చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement