సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే మశ్చేందర్(95) రావు కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో అస్వస్థతకు గురైన ఆయన ఇవ్వాల (శుక్రవారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని ఆల్వాల్‌కు చెందిన బింగి మశ్చేందర్ రావు 1934లో జన్మించారు. డిగ్రీ చదివిన ఆయన ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓడిపోయారు.
మూడోసారి 1978లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 1983లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. ఎమ్మెల్యేగానే కాకుండా సిండికేట్ బ్యాంక్ డైరెక్టర్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా డైరెక్టర్, హైదరాబాద్ టెలికాం సభ్యుడు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జువైనల్ కోర్టు సభ్యుడిగానూ పనిచేశారు. రాజకీయాలకు దూరమైన తర్వాత మశ్చేందర్ రావు ఆల్వాల్‌లోని 200 గజాల్లో నిర్మించుకున్న ఒక చిన్న ఇంట్లో సాధారణ జీవితం గడిపారు. మశ్చేందర్ రావుకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు గతంలోనే మరణించారు.