హైదరాబాద్ : మీ బంగారు రి-టైర్మెంట్ భవిష్యత్తు కోసం – నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఉపయోగపడుతుందని హెచ్డీఎఫ్సీ పెన్షన్ మేనేజ్మెంట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీరామ్ అయ్యర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… మన భవిష్యత్తు కోసం ఎంతో కొంత దాచుకోవడం అవసరమని భారతీయులం విశ్వసిస్తాం. సాధారణంగా ఇంటి కొనుగోలు అలాగే తమ పిల్లల జీవితాల్లో కీలక మైలురాళ్లు వంటి విద్య, వివాహం తదితర దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమయ్యే డబ్బును సమకూర్చుకునేందుకు తల్లిదండ్రులు కొంత నిధిని ఏర్పాటు చేయడం లాంటివి సర్వసాధారణంగా పాటిస్తుంటామన్నారు.మన సంస్కృతి రీత్యా వృద్ధాప్యంలో కుటుంబంపై ఆధారపడటమనేది అలవాటుగా ఉండటం వల్ల రిటైర్మెంట్ అవసరాల కోసం ప్రణాళిక వేసుకునే విషయానికొస్తే మాత్రం చాలా సందర్భాల్లో తర్వాత చూద్దాంలే అని పక్కన పెట్టేస్తుంటామన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబమనేదే దాదాపుగా కనిపించడం లేదన్నారు.
కాబట్టి తగు ఆర్థిక ప్రణాళికతో మన గోల్డెన్ ఇయర్స్ కోసం సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడుతోందన్నారు. ఉద్యోగుల భవిష్య నిధి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యుచువల్ ఫండ్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) మొదలైన సాధనాలు ఎన్నో ఉన్నాయన్నారు. సర్వీస్ ప్రొవైడర్ ఎంచుకున్న పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌ను బట్టి వీటిలో ఒక్కో దానిలో ఒక్కో రకమైన ప్రయోజనం, రాబడులు ఉంటాయన్నారు.పలు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, మనం వివిధ రకాల ప్లాన్లను సముచితంగా ఉపయోగించుకోగలగాలంటే ఒక్కో దాని గురించి కూలంకషంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. ద్రవ్యోల్బణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మన ప్రస్తుత సంపాదనకు సరిసమానమైన స్థాయిలో ఆదాయం అందుకునేలా తగినంత నిధిని ఏర్పాటు చేసుకోవడమనేది లక్ష్యంగా ఉండాలన్నారు.
రిటైర్మెంట్ కోసం నిధిని ఏర్పాటు చేసుకునేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు ఏమిటి?
సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలి, దీర్ఘకాలిక కోణంలో ఆలోచించాలి: చాలా వరకు ఆర్థిక సాధనాలన్నీ కూడా దీర్ఘకాలికంగా పెట్టుబడులు కొనసాగించడం వల్ల వచ్చే ప్రయోజనాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటాయన్నారు. ఎందుకంటే పెట్టుబడులను దీర్ఘకాలికంగా కొనసాగించడం వల్ల కాంపౌండింగ్ మహిమ ప్రయోజనాలను అత్యధికంగా పొందవచ్చన్నారు. మీరు 25 సంవత్సరాల పాటు ఏడాదికి రూ. 50,000 చొప్పున ఆదా చేస్తూ వెళ్తే – వార్షికంగా 8% రాబడి రేటు ఉంటుందని అంచనా వేస్తే దాదాపు రూ. 40 లక్షల నిధి పోగవుతుందన్నారు. అదే మీరు 5ఏళ్ల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభిస్తే మీ నిధి రూ.15 లక్షల మేర తగ్గిపోయి రూ.25 లక్షలకు మాత్రమే పరిమితమవుతుందన్నారు. ఒకే పెట్టుబడిపై సమయ ప్రభావం ఎలా ఉంటుందనేది ఈ ఉదాహరణ ద్వారా తెలుస్తుందన్నారు. కాంపౌండింగ్ మహిమ అంటే ఇదేనన్నారు. కాబట్టి మీరు ఎంత ముందుగా ప్రారంభిస్తే అంత మంచిదన్నారు.
అధిక రాబడులను అందించే సాధనాన్ని ఎంచుకోండి: దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణానికి మించిన రాబడులు అందించగలిగే సామర్ధ్యాలున్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ముఖ్యమన్నారు. దీర్ఘకాలికంగా ఒక పెట్టుబడి సాధనంగా ఈక్విటీలో (మ్యుచువల్ ఫండ్స్, ఎన్పీఎస్ వంటి ప్రొఫెషనల్‌గా నిర్వహించబడే స్టాక్స్ బాస్కెట్ వంటివి)లో ఇన్వెస్ట్ చేస్తే, కాలక్రమేణా పెట్టుబడి పెట్టిన అసలును నష్టపోయే రిస్కులు తగ్గడంతో పాటు రెండంకెల స్థాయిలో చక్రీయంగా రాబడులు అందుకునే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. 1995 నుంచి కాల వ్యవధిని తీసుకుని, నిఫ్టీ 50 వంటి పాసివ్ స్టాక్స్ బాస్కెట్‌ను ఏ పదేళ్ల వ్యవధికైనా పరిశీలిస్తే, మీరు ఏడాదికి రెండంకెల స్థాయిలో రాబడులు అందుకునే సందర్భాలు నాలుగింటిలో మూడు ఉంటాయన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా మీరు అసలు డబ్బు పోగొట్టుకునే పరిస్థితే ఎదురయ్యేది కాదన్నారు. యాక్టివ్ మేనేజ్డ్ ఫండ్‌ను ఎంచుకుంటే ఈ అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయన్నారు. కాబట్టి పోర్ట్‌ఫోలియో దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణానికి మించిన రాబడులు అందించేలా ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేసే సాధనాన్ని ఎంచుకోవడం శ్రేయస్కరమన్నారు.
తక్కువ చార్జీలు: మార్కెట్ ఆధారిత పెట్టుబడులపై ఫండ్ మేనేజర్లు చార్జీలు విధిస్తారు. కాబట్టి, తక్కువ చార్జీలు ఉండే సాధనాన్ని ఎంచుకోవడం మంచిదన్నారు. దీనివల్ల మీ పెట్టుబడిని గరిష్టంగా పెంచుకునేందుకు వీలవుతుందన్నారు. 25 ఏళ్ల వ్యవధిలో మీ డబ్బు నిర్వహణ వ్యయం 1 శాతం అధికంగా ఉన్నా, మీ నిధి పరిమాణం 10-15 శాతం తక్కువకు పరిమితమవుతుందన్నారు. మరో విధంగా చెప్పాలంటే ఫండ్ నిర్వహణ వ్యయాలను మిగుల్చుకోవడం వల్ల, స్థూలంగా 8శాతం వార్షిక రాబడి రేటు చొప్పున లెక్కేసినా, మీ నిధి పరిమాణాన్ని మరో 12-15 శాతం పెంచుకోవచ్చన్నారు.
తక్కువ జోక్యం: మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనప్పుడు పెట్టుబడులను నిర్వహించుకోవడానికి అపార అనుభవం అవసరమవుతుందన్నారు. అంతే గాకుండా వయస్సు పెరిగే కొద్దీ ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. సాధారణ వ్యక్తులకు ఇదంతా చేయడం అంత సులభమైన వ్యవహారం కాదన్నారు. ఇటు మార్కెట్ ఒడిదుడుకులను అటు పెరిగే వయస్సుకు అనుగుణంగా అసెట్ కేటాయింపులను సమర్ధంగా నిర్వహించగలిగే సాధనమనేది సురక్షితమైన, నిరాటంకమైన విధంగా నిధిని సమకూర్చుకోవాలనుకునేవారికి మంచి ఎంపిక కాగలదన్నారు.
పక్షపాత ధోరణులను నియంత్రించుకోవడం: ఈక్విటీ సాధనంలో రాబడులు అందుకోవాలంటే, మీ చుట్టుపక్కల ఉండే రణగొణ ధ్వనులను పట్టించుకోకుండా, మార్కెట్లో అన్ని వేళలా పెట్టుబడిని కొనసాగించడం చాలా ముఖ్యమన్నారు. మీ రిటైర్మెంట్ అవసరాల కోసం నిధిని ఏర్పర్చుకోవాలనే లక్ష్యం కోసం మీరు తప్పనిసరిగా పెట్టుబడులను కొనసాగించేలా చూసే విధమైన, అలాగే మీ లక్ష్యానికి మీరు కట్టుబడి ఉండేలా చేసే విధమైన సాధనం ఉండాలన్నారు. దీర్ఘకాలిక సంపద సృష్టికి అడ్డంకులుగా నిలిచే మానవ భావోద్వేగాలు, పక్షపాత ధోరణులను నియంత్రించుకునేందుకు ఇలాంటిది ఉపయోగపడుతుందన్నారు.
పన్ను ప్రయోజనం: పెట్టుబడులపైన, పోగుపడిన నిధిపైన, దాన్ని ఉపసంహరించుకునేటప్పుడు – ఇలా పెట్టుబడి పెట్టే క్రమంలో వివిధ దశల్లో పన్నుపరమైన ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఇవే పన్నుల అనంతరం మీకు వచ్చే ఆదాయాన్ని నిర్దేశించే కీలకమైన అంశాలు. వివిధ సాధనాలు వివిధ రకాలుగా పన్ను ప్రయోజనాలు అందించగలవన్నారు. ఎన్పీఎస్ లేదా ఈపీఎఫ్ వంటి సాధనం, పెట్టుబడి ప్రస్థానంలో, అంటే పెట్టుబడి పెట్టేటప్పుడు (నిర్దిష్ట పరిమితి వరకు), పోగుపడిన మొత్తంపై అలాగే మెచ్యూరిటీ సమయంలోనూ, పన్ను ఆదా/మినహాయింపు ప్రయోజనాలు అందిస్తుందన్నారు. వివిధ సాధనాల మేళవింపుపై నిర్ణయం తీసుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాల్లో ఇది కూడా ఒకటన్నారు. పైన పేర్కొన్న అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న మీదట, ఈ అర్హతలన్నీ కలిగి ఉండేలా తీర్చిదిద్దిన సాధనం ఒకటి ఉందన్నారు. అదే నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్). ఇందులో ఈ కింది ప్రయోజనాలు ఉంటాయి:
- ఫండ్ ఎంపిక స్వేచ్ఛ – ఈక్విటీ, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు అలాగే మీ అభీష్టం ప్రకారం వీటి మేళవింపు (యాక్టివ్ చాయిస్ ఆప్షన్లో) లేదా వయస్సు, రిస్కు సామర్ధ్యాల ప్రాతిపదికన ముందే నిర్ణయించిన విధంగా కేటాయింపులు జరిపే ఆటో మోడ్ (ఆటో చాయిస్ ఆప్షన్లో)
- వయస్సును బట్టి ఆటోమేటిక్‌గా రీబ్యాలెన్స్ కావడం (ఆటో చాయిస్ ఆప్షన్ కింద)
- తక్కువ చార్జీలు (0.10% కన్నా తక్కువ – దాదాపు ఇతరత్రా పోల్చతగిన యాక్టివ్ మేనేజ్డ్ ఫండ్స్‌తో చూస్తే ఫండ్ నిర్వహణ వ్యయంలో దాదాపు 1/15 వంతు)
- దీర్ఘకాలికంగా పెట్టుబడిని కొనసాగించడం వల్ల కాంపౌండింగ్ మహిమ ప్రయోజనాలు పొందడం.
- పన్ను ప్రయోజనం: సెక్షన్ 80 సీసీడీ (2) కింద వేతన జీవులకు ఎన్పీఎస్ గణనీయంగా పన్ను ప్రయోజనాలు అందిస్తుంది: జీతం బేసిక్‌లో 10 శాతం (+డీఏ, వర్తిస్తే) మొత్తాన్ని కార్పొరేట్ ఎన్పీఎస్ మార్గంలో ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు, తద్వారా ఉద్యోగి వేతన శ్లాబ్ ప్రకారం చెల్లించాల్సిన పన్ను భారం పడకుండా చూసుకోవచ్చు. వేతన జీవులు కాని వారి విషయానికొస్తే, పాత విధానం ప్రకారం ఇతర ట్యాక్స్ సేవింగ్ సాధనంలో ఇన్వెస్ట్ పరిమితి రూ. 1.5 లక్షలు దాటి ఎన్‌పీఎస్‌లో రూ. 50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద ఇందుకు అర్హత కలిగి ఉండే సాధనం ఎన్పీఎస్ ఒక్కటే.
- పెన్షన్ ఫండ్ మేనేజర్లు ఇన్వెస్ట్ చేయదగిన సాధనాలకు సంబంధించి పీఎఫ్ఆర్డీఏ (PFRDA) స్పష్టంగా నిర్వచించిన పటిష్టమైన రిస్క్ నిర్వహణ ఫ్రేమ్‌వర్క్
- నిశితమైన నియంత్రణ సంస్థ పర్యవేక్షణ/అజమాయిషీ అలాగే పెన్షన్ ఫండ్ మేనేజర్ల పనితీరును సరైన దారిలో ఉంచడం మంచిదన్నారు.
ఆయా ఫండ్స్ అందించిన రాబడుల ఆధారంగా మీరు మీ పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను ఎంపిక చేసుకోవచ్చన్నారు. npstrust.org.inలో ఈ సమాచారం సులభంగా అందుబాటులో ఉంటుందన్నారు. మీ రిటైర్మెంట్ సమయాన్ని సౌకర్యవంతంగా గడిపేందుకు వీలైనంత త్వరగా పెట్టుబడులను ప్రారంభించండని తెలిపారు.