హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లిహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచర ఘటన సృష్టించిన ప్రకంపనలు ఆగకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. నగరంలోని పాతబస్తీలోని మొఘల్‌పురా పోలీసుస్టేషన్ పరిధిలో మైనర్ బాలికను నాలుగు రోజుల క్రితం క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. అయితే బాలిక కిడ్నాప్ అయిందన్న విషయం తెలియని తలిదండ్రులు పోలీసులకు తప్పిపోయిందని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు అందిన మరుసటి రోజు బాలిక తిరిగి ఇంటికి వచ్చింది. ఆ బాలికను పోలీసులు విచారించగా లుక్మాన్ అనే క్యాబ్ డ్రైవర్ తనను రంగారెడ్డి జిల్లాలోని ఓ ఊరికి తీసుకు వెళ్ళాడని తెలిపింది. దీంతో మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా మార్చిన పోలీసులు క్యాబ్ డ్రైవర్ లుక్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
బాలికను రంగారెడ్డి జిల్లా కొందుర్గుకు తీసుకు వెళ్ళినట్లు, అక్కడ తనకు తెలిసిన వ్యక్తులు తమకు ఆశ్రయమిచ్చారని వెల్లడించాడు. వెంటనే లుక్మాన్‌కు ఆశ్రయమిచ్చిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలికను కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళడానికి కారణాలు ఏమిటి?, అసలు ఆ రాత్రి కొందుర్గ్‌లో ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. పోలీసుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.