– ప్రభన్యూస్, హైదరాబాద్
రాజధాని అడ్డగా అక్రమ పద్ధతుల్లో ఆస్పత్రులను పెట్టి వైద్య సేవల ముసుగులో వ్యాపారం నిర్వహిస్తున్న ఆస్పత్రుల భరతం..వైద్యారోగ్యశాఖ అధికారులు పడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 49 ఆస్పత్రులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 23, 24న హైదరాబాద్ జిల్లాలో తనిఖీలను ముమ్మరం చేశారు. వైద్యారోగ్యశాఖ సంచాలకులు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేస్తున్నామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి శనివారం ప్రభన్యూస్తో చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 49 ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. రెండు ఆస్పత్రులను సీజ్ చేశారు. మరో 14ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మూడు ఆస్పత్రులకు జరిమానా విధించారు.
కఠిన చర్యలు చేపడతాం
జిల్లాలో అనుమతి లేకుండా దవాఖానాల ముసుగులో దగా ఖానాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి హెచ్చరించారు. అనుమతిలేని ఆస్పత్రులపై సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు(ఎస్పీహెచ్వోల) ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. అందువల్ల అనుమతి లేని వారు తప్పనిసరిగ్గా అనుమతులు తీసుకోవాలని, నిబంధనల ప్రకారమే ఆస్పత్రులను నిర్వహించాలన్నారు.