హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాగల రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతోపాటు గంటకు 30కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు గురువారం తెలంగాణ అంతటా విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని తెలిపింది. కాగా, పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నల్గొండ, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇన్ని రోజులు భానుడి భగభగలతో అల్లాడిపోయిన ప్రజలకు వర్షాకాలం ప్రారంభమవడంతో ఉపశమనం లభించింది. తెల్లవారుజామునుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు వానాకాలం సాగును ఉత్సాహంగా మొదలు పెట్టారు. నైరుతి రాకతో వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్రమంతా వాతావరణం చల్లబడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో బుధవారంనాడు వర్షాలు కురిశాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, మిడ్జిల్, సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, నల్గొండ జిల్లాలో దేవరకొండలో భారీ వర్షం కురిసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.