Tuesday, November 19, 2024

Exclusive – హనీ ట్రాప్​! ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు

విశాఖపట్నంలో వెలుగుచూసిన ఘటన
మ నటించడం, కబుర్లు చెప్పడం
న్యూడ్​ ఫొటోలతో కవ్వింపు చర్యలు
ఏకాంతంగా కలిసిన ఫొటోలతో బెదిరింపులు
డబ్బులు ఇవ్వకుంటే ముఠాతో దాడులు
వెలుగులోకి వస్తున్న మోసాల గుట్టు
సైబర్​ ఫ్రాడ్​కు పాల్పడుతున్న గ్యాంగ్​
జెమీమా ఆగడాలు అన్నీ ఇన్నీ కావు
దీని వెనకాల ఉన్నది ఫారెస్ట్​ ఆఫీసరేనా?
ఆరా తీస్తున్న విశాఖ పోలీసులు
తెలంగాణలో ఓ ఎమ్మెల్యేకు న్యూడ్​ కాల్స్​

ఆంధ్రప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌:

డబ్బున్న‌ యువకులకు టార్గెట్ చేసుకుని ఫోన్ చేయడం.. తీయటి మాటలతో వారిని బుట్ట‌లో వేసుకుని న్యూడ్ వీడియోలు, కాల్స్ చేయ‌డం.. ఆ త‌ర్వాత ఏకాంతంగా గ‌డిపిన పొటోలతో బెదిరింపులకు దిగ‌డం.. ఇప్పుడీ త‌ర‌హా మోసాలు ఏపీ ఆర్థిక రాజ‌ధాని విశాఖ‌లో పెచ్చుమీరాయి. ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో హనీట్రాప్‌ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ తెలంగాణలో ఆ యువతి బాధితులు చాలామంది ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇక‌.. ఏపీలో జరిగే సైబర్‌ మోసాల్లో బాధితులు ఎక్కువ మంది విశాఖ వాసులే. విశాఖపట్నం కేంద్రంగా సైబర్‌ నేరగాళ్లు మోసాలకు తెగబడటం, ఇతర దేశాల్లోని ముఠాలతో కలిసి ఇక్కడే సెంట‌ర్లు ఏర్పాటు చేయడం న‌గ‌ర‌వాసుల‌ను కలవర పెడుతోంది. నెల రోజుల వ్యవధిలో వెలుగులోకి వచ్చిన పలు మోసాల తీరు తెలిసి సిటీ జ‌నం ఆందోళ‌న‌కు గురవుతున్నారు.

బ‌య‌ట‌కు వ‌స్తున్న బాధితులు..

మురళీనగర్‌ కేంద్రంగా జాయ్‌ జెమీమా అనే యువతి హనీట్రాప్‌కు (ప్రేమ పేరుతో వలలో వేసుకోవడం) తెరలేపింది. ఆమె బాధితులు ఇటీవల ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఓ ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదుతో ఈ నెల 4వ తేదీన భీమిలి స్టేషన్‌ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. 5వ తేదీన కోర్టుకు హాజరుపర్చి రిమాండ్‌కు పంపారు. 9వ తేదీన భీమునిపట్నం స్టేషన్‌కు జ్యుడిషియల్‌ కస్టడీకి తీసుకుని ఏసీపీ అప్పలరాజు విచారణ చేప‌ట్టారు. ఈ నేపథ్యంలో బాధితులు ముందుకొచ్చి కంచరపాలెం, ఎయిర్‌పోర్ట్ స్టేషన్లలోనూ జమీమాపై కేసులు పెట్టారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈమె బాధితులు చాలామంది ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఎలా వలలో వేసుకోవాలి? మత్తు మాట‌ల‌ను ఎలా ప్రయోగించాలి? వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ ఎలా చేయాలి? అనే అంశంపై ఓ ముఠా శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇంకా ఆ ముఠా కోసం పోలీసులు సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఓ ఫారెస్ట్ ఆఫీస‌ర్‌ హడావుడి..

ఈ ముఠాలో ఓ ఫారెస్ట్ ఆఫీస‌ర్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. హనీట్రాప్‌ చేస్తున్న జెమీమా ఖాతా నుంచి ఆ అధికారి ఖాతాకు నగదు లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించి, సదరు అధికారిని పిలిపించి సీక్రెట్‌గా విచారణ చేస్తున్నట్లు సమాచారం. విచిత్రమేమంటే ఆమెను అరెస్టు చేసిన సమయంలో ఆ అధికారి పోలీసులకు ఫోన్‌ చేసి హడావుడి చేసినట్లు తెలుస్తోంది. ‘జెమీమా నాకు బంధువు అవుతుంది. కేసు ఎలా పెడతారు? ఎలా అరెస్ట్ చేస్తారు?’ అంటూ పోలీసులనే హెచ్చరించడంతో అనుమానం వచ్చి ఆయన బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, ఫోన్‌ కాల్స్‌పై పోలీసులు దృష్టి పెట్టినట్లు చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్స్

ఇక ఓ మహిళ న్యూడ్ కాల్ చేసి తెలంగాణలోని ఓ ఎమ్మెల్యేకు ముచ్చెమటలు పట్టించింది. ఈ ఘటన ఇప్పుడు అంత‌టా సంచలనం రేపింది. ఈనెల 14వ తేదీన జ‌రిగిన ఘటనతో బేంబేలెత్తిన ఆ ఎమ్మెల్యే సైబర్ క్రైమ్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు ఆ మహిళ ఎవరు.? న్యూడ్ కాల్ చేయడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే చర్చ మొదలైంది.

సైబర్ సెక్యూరిటీ ఆరా…

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఈనెల14వ తేదీన ఓ వీడియో కాల్ వచ్చింది. కాల్‌కు రెస్పాండ్ కాగానే ఓ మహిళ నగ్నంగా కనిపించింది. అంతే ఆ ఎమ్మెల్యే ఫోన్ కట్ చేశారు. వీడియో కాల్ వచ్చిన ఫోన్ నెంబర్ ఎవరదని ఆరా తీశారు. ఆ నెంబర్ ఎమ్మెల్యేతో పరిచయం ఉన్న వ్యక్తులది కాకపోవడంతో షాకయ్యారు. దీంతో ఈనెల 17వ తేదీన హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ సెక్యూరిటీ పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన మహిళ ఎవరనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు మహిళ నుంచి న్యూడ్ కాల్ రావడం వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా ఆమెతో చేయించారా? .. అసలు ఫోన్ కాల్ చేసిన మహిళ ఏ ప్రాంతం నుంచి కాల్ చేశారు? ఆమె విదేశాల నుంచి వీడియో కాల్ చేశారా? అనే వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

================
వెలుగులోకి వస్తున్న సైబర్​ నేరాలు..

= సెప్టెంబర్‌ 28న ఢిల్లీలో నమోదైన కేసులో భాగంగా మురళీనగర్​, ఎండాడలో ఉంటూ కాల్‌ సెంటర్లు నిర్వహిస్తున్న తొమ్మిది మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. నిరుద్యోగులే లక్ష్యంగా వీరు సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు.

= చైనా, తైవాన్‌లోని సైబర్‌ నేరగాళ్లకు సహకరిస్తూ విశాఖ కేంద్రంగా కాస్పెటిక్స్ అమ్మకాల పేరుతో బెట్టింగ్‌ యాప్‌లు, టాస్క్‌ గేమ్‌లు, ఫెడెక్స్‌ కొరియర్‌ నిర్వహిస్తున్న ఏడుగురితో కూడిన ముఠాను 17న అరెస్ట్ చేశారు.

= అహ్మదాబాద్‌ నిఘా విభాగం నుంచి విశాఖకు సమాచారం వచ్చింది. ఏఎన్‌బీచ్‌, విశాలాక్షినగర్ సమీపంలోని ప్లాట్లు అద్దెకు తీసుకుని సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు ఖాతాలు సేకరించి సొమ్ము కాజేసి తైవాన్​, చైనాకు నగదు బదిలీ చేస్తున్నట్లు గుర్తించారు.

= ఏపీకి చెందిన నిరుద్యోగ యువతే లక్ష్యంగా నకిలీ ఐడీలతో బ్యాంకు ఖాతాలు తెరిచి వారి నుంచి డబ్బులు కాజేస్తున్న నలుగురు ముఠా సభ్యులను శుక్రవారం అరెస్ట్ చేశారు.

= 17 రాష్ట్రాల్లో 50 సైబర్‌ నేరాల ఫిర్యాదులు అందాయి. ఈ ముఠా ₹40 కోట్ల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement