హైదరాబాద్ : మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (66) మృతి చెందారు. కొన్నాళ్లుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్న ఆయన మూడురోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు కరోనా సోకినట్లు నిర్ధారించి చికిత్స అందించారు. గురువారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో చికిత్స అందిస్తుండగానే రాత్రి 11 గంటలకు ఆయన కన్నుమూశారు. చందూలాల్‌కు భార్య శారద, కుమార్తె పద్మ, కుమారులు ధరమ్‌సింగ్, ప్రవీణ్ ఉన్నారు. చందూలాల్ స్వస్థలం భూపాలపల్లి జిల్లా ములుగు మండలం.
చంద్రబాబు దిగ్భ్రాంతి..
మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతిపట్ల టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హయాంలో చందూలాల్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారని, గిరిజనుల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చంద్రబాబు చెప్పారు
కేటీఆర్ సంతాపం
మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. చందూలాల్ మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. రాజకీయాల్లో అనేక హోదాల్లో సుదీర్ఘకాలం పాటు ప్రజలకు, ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి కోసం అపూర్వమైన సేవలందించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని, చందూలాల్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. అలాగే మాజీ మంత్రి చందులాల్ మృతిపట్ల పలువురు జిల్లా నేతల సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు నరేందర్, వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ సంతాపం తెలిపారు.