Tuesday, November 26, 2024

డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.. మంత్రి సబితా రెడ్డి

బాలాపూర్ : కళాశాల విద్యార్థులు మాద‌కద్రవ్యాలకు అలవాటు పడకుండా ఆదిలోనే అంతం చేసేందుకు పోలీస్ వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేస్తుందని, రాష్ట్రంలో షీ టీం బాగా పనిచేస్తుందని, ఆడపిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు కూడా షీ టీం పంచుకుంటున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని, జిల్లాలగూడలోని సామయాదిరెడ్డి కన్వెన్షన్ హాల్ లో, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, రాచకొండ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్, సైనా నెహ్వాల్, డిసిపి సన్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… డ్రగ్స్ నిర్మూలించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని కళాశాలల్లో ర్యాగింగ్ ను ఏ విధంగా నిర్మూలించిందో అదేవిధంగా డ్రగ్స్ వాడకాన్ని కూడా నిర్మూలించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ ను వాడి విద్యార్థుల జీవితాలను నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడకం కళాశాల నుండి పాఠశాలకు చేరకముందే కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. రాచకొండ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్ వాడొద్దన్నారు. సోషల్ మీడియా ఫోన్లకు విద్యార్థులు దూరంగా ఉన్నప్పుడే జీవితాన్ని బంగారు బాటగా మార్చుకోవచ్చన్నారు. రాచకొండ కమిషనరేట్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటిసారి మహేశ్వరం నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, మీర్పేట్ ఇన్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి, బాలాపూర్ ఇన్ స్పెక్టర్ భాస్కర్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement