Friday, November 22, 2024

ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి : డాక్ట‌ర్‌. వేదాస్వి రావు వెల్చల

ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కొండాపూర్ కిమ్స్ హాస్పిట‌ల్స్ క‌న్స‌ల్టెంట్ ఇంట‌ర్న‌ల్ మెడిసిన్ డాక్ట‌ర్‌. వేదాస్వి రావు వెల్చల అన్నారు. ఆమె మాట్లాడుతూ…ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఆరోగ్యంగా ఉండాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేస్తుంది అంత‌ర్జాతీయ ఆరోగ్య సంస్థ (WHO) అన్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఏప్రిల్ 7వ తేదీన అంత‌ర్జాతీయ ఆరోగ్య దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తుందన్నారు. ఇందులో భాగంగా వివిధ కార్యాక్ర‌మాల ద్వారా ప్ర‌జల్లో అవ‌గాహాన క‌ల్పిస్తుందన్నారు. ఈ సంవ‌త్స‌రం కూడా మ‌న గ్ర‌హాం- మ‌న ఆరోగ్యం అనే థీమ్‌తో ముందుకు వెళ్తుందన్నారు. కోవిడ్‌-19 త‌ర్వాత మూడు ద‌శ‌ల‌లో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌ణ చూశామ‌ని, వాటిని త‌ట్టుకోవాలంటే ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిశుభ్ర‌త‌కు, ఆరోగ్యానికి పెద్దపీట వేయాలన్నారు. వ్యాధుల నుండి కోలుకోవ‌డంలో, మంచి ఆరోగ్యంగా జీవించాలంటే మ‌నం నివ‌సించే ప‌ర్యావ‌ర‌ణ ప్రాంతం చాలా ముఖ్య‌మైన పాత్ర పోషిస్తుందన్నారు. జనాభాలో 90శాతంకు పైగా శిలాజ, ఇంధనాల దహనం, ఆయా ప‌రిశ్ర‌మ‌ల నుండి వెలుబ‌డే అనారోగ్యకరమైన గాలిని పీల్చుకుంటున్నారన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం చర్యలు తీసుకోవడం ప్రతి వ్యక్తి బాధ్యత అన్నారు. ప్ర‌జ‌లు ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారించాల్సిన స‌మ‌యమ‌న్నారు. మారుతున్న జీవ‌న శైలిలో భాగంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. స‌రైన స‌మ‌యానికి నిద్ర లేవ‌క‌పోవ‌డం, స‌రైన స‌మ‌యంలో భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం అనేవి మ‌నిషి ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతాయన్నారు. కాబ‌ట్టి వ్యాయామం, ఆహారంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకోవాలన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు మనకు ఏమి అవసరమో, మన భవిష్యత్ తరాలకు ఏమి అవసరమో ఒక్క నిమిషం ఆలోచించి, మన పరిసర వాతావరణాన్ని మెరుగుపరచడానికి మొదటి అడుగు వేద్దామ‌ని డాక్ట‌ర్‌. వేదాస్వి రావు వెల్చల అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement