తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. ఇప్పటికే రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్, సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మైకులు మూగపోయాయి. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికకు ఏర్పాట్లు జరిగాయి.
17లోక్‌సభ స్థానాలు.. 625 మంది అభ్యర్ధులు
నాలుగో విడతలో భాగంగా జరిగే పోలింగ్‌లో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో 625 మంది రంగంలో ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి అత్యధికంగా 45 మంది బరిలో ఉన్నారు. ఆ తర్వాత మెదక్ నుంచి 44 మంది.. చేవెళ్ల నుంచి 43మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి నుంచి 42, కరీంనగర్ నుంచి 28, నిజామాబాద్ నుంచి 29, మహబూబ్ నగర్ నుంచి 31, నాగర్ కర్నూల్ నుంచి 19, నల్గొండ నుంచి 22, భువనగిరి నుంచి 39, వరంగల్ 40, మహబూబాబాద్ 23, ఖమ్మం నుంచి 35, హైదరాబాద్ లోక్ సభ సీటు నుంచి 30, మల్కాజ్‌గిరి 22, జహీరాబాద్ నుంచి 19, ఆదిలాబాద్‌లో అతి తక్కువగా 12 మంది బరిలో ఉన్నారు. 17లోక్ సభ సీట్లలో ఆదిలాబాద్, మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు.. కాగా, అన్ని స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఎంఐఎం ఒక్క హైదరాబాద్‌లోనే పోటీలో ఉంది.
కాంగ్రెస్ తరుపున అగ్రనేతలు..
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వం ముఖ్యమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేంద్రంగానే కొనసాగింది.. 57 రోజుల పాటు సాగిన ప్రచారంలో రేవంత్ ఏకంగా అన్ని లోక్ సభ స్థానాలలో ప్రచారం నిర్వహించారు.. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్‌తో హోరేత్తించారు.. మొత్తం ఆయన 47 సభలలో పాల్గొనడం విశేషం.. ఇక రాహుల్ గాంధీ, ప్రియాంకా సైతం నాలుగు సార్లు ప్రచారానికి వచ్చారు. చివరి రోజున ప్రియాంకా , రేవంత్ రెడ్డి లు పటాన్ చెరు, తాండూరు, కామారెడ్డిలో ప్రచారం నిర్వహించి ప్రచారానికి ముగింపు ఇచ్చారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం ప్రచారంలో పాలుపంచుకున్నారు.
మోదీ, అమిత్ షా ప్రచారం
తెలంగాణలో స్థానిక నేతలకు మద్దతుగా స్వయంగా మోదీ, అమిత్ షా రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల్లోని బీజేపీ ముఖ్యమంత్రులు ప్రచారపర్వంలో పాల్గొన్నారు.. 14 రోజుల్లో మోదీ ఏకంగా 12 సభల్లో పాల్గొవడం విశేషం. హైదరాబాద్‌లో శుక్రవారం రోడ్ షో నిర్వహించి నేతలలో జోష్ నింపారు.. ఇక చివరి రోజు అమిత్ షా వికారబాద్, వనపర్తి సభలలో ప్రసంగించి ప్రచార ఘట్టానికి స్వస్తి పలికారు.
ఉద్యమనేత కేసీఆర్ పోరుబాట..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మరిచిపోయేలా.. లోక్‌సభలో అత్యధిక సీట్లు గెలవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించింది. ఉద్యమనేత కేసీఆర్ పోరుబాట పేరుతో ఏకంగా 17 రోజుల పాటు బస్సు యాత్ర చేశారు. రోజుకు రెండు లేదా మూడు చోట్ల రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించి పార్టీలో జోష్ నింపారు. ఇక.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో ముఖ్య నేత హరీశ్‌రావు ప్రచార బాధ్యతలను పంచుకున్నారు. ఈ ఇద్దరు కలిసి 80కి పైగా మీటింగ్‌లలో పాల్గొని నేతలలో ఉత్తేజం నింపారు.
లక్షకుపైగా ఈవీఎంలు
ప్రచార పర్వానికి తెరపడటంతో పోలింగ్ ప్రక్రియకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 13న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్ల కోసం 35,809 పోలింగ్ కేంద్రాల్లో 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 50,135 వీవీప్యాట్‌లు, 44,906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 625మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఎన్నికల ఆంక్షలు:
- ప్రచారంలో పాల్గొన్న స్టార్ క్యాంపేయినర్లు, నాన్ లోకల్ లీడర్లు సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాలి
- ఐదుగురికి మించి రోడ్డుపైకి రాకూడదు.
- మైక్రోఫోన్లు, స్పీకర్ల ద్వారా పాడటం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం నిషేధం.
- బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిరి వంటి నిర్మాణాలు అనుమతించరు.
- వ్యక్తులు, సంఘాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, సంకేతాలను ప్రదర్శించడం నిషేధం.
- కర్రలు, తుపాకులు, మారణాయుధాలతో కూడిన జెండాలను పోలింగ్ కేంద్రాల నుంచి కిలోమీటరు దూరం వరకు తీసుకెళ్లకూడదు.
- ఆత్మరక్షణ కోసం కర్రలు, తుపాకులు, మారణాయుధాలు వాడడం నిషేధం.
- మద్యం, మద్యం దుకాణాలు, బార్లు, మద్యం విక్రయించే అన్ని దుకాణాలు మూడు రోజులు మూసివేత