గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను ఆధునీకరించాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. అందుకోసం ప్రస్తుతం కొనసాగుతున్న మ్యానువల్ విధానం కంటే.. మరింత ప్రామాణికంగా డ్రైవింగ్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందే వారిని అడ్డుకునేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే, అందుబాటులోకి తీసుకురానున్న కొత్త పద్ధతిలో రహదారులపై నిత్యం ఎదురవుతున్న ఇబ్బందులను టెస్ట్ ట్రాక్‌పై కృత్రిమంగా కల్పిస్తారు.
లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు తప్పని సరిగా పరీక్ష రాయాల్సిందే. ట్రాక్ మీద వాహనం నడిపిన తర్వాతే లైసెన్స్ పొందుతారు. అయితే, ట్రాక్ మీద వాహనం నడిపేటప్పుడు కంప్యూటర్‌లో రికార్డవుతుంది. ఏదైనా చిన్న తప్పు చేసినా.. పరీక్ష ఫెయిల్ అయినట్టే.
చిన్న మిస్టేక్ చేసినా టెస్ట్‌లో ఫెయిల్…
కొత్తగా ఆర్టీఏ అమలు చేయబోయే ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ లో 5 ట్రాక్లు ఏర్పాటు చేస్తారు. ముందుగా H ట్రాక్‌లో ఆర్టీఏ ప్రమాణాల్లో పేర్కొన్న విధంగా వాహనాన్ని రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత S అనే ట్రాక్‌లో ఒక మూల నుంచి మరో మూలకు వెహికల్ను టర్న్ చేయాలి. అలాగే K అనే ట్రాక్‌లో బాగా మలుపులు, ఎత్తుపల్లాలు, ఎత్తయిన ప్రదేశాలు, చిన్న లోయలు వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ఆ ట్రాక్‌లో వాహనాన్ని నడిపి.. చివరగా బండిని పార్కింగ్ చేసి చూపించాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ అంతా కంప్యూటర్లో రికార్డవుతుంది. ఏ చిన్న మిస్టేక్ చేసినా టెస్ట్‌లో ఫెయిల్ అయినట్టు చూపిస్తుంది. ఒకవేళ పరీక్షలో ఫెయిల్ అయితే మరో నెల పాటు శిక్షణ తీసుకుని మళ్లీ రమ్మంటారు. పూర్తి కంప్యూటరీకరణ కావడంతో ఇక్కడ అధికారులు, సిబ్బంది నిర్వహణకు అవకాశం ఉండదని.. బ్రోకర్లకు కూడా అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.