ప్రేమించాలంటూ యువతి వెంట పడి వేధిస్తున్న ఓ ప్రబుద్ధుడి పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ప్రేమించాలంటూ అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను వేధింపులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
సామాజిక మాధ్యమాల్లో కాల్‌గర్ల్ అంటూ పెడతానంటూ ఓ యువతిని వేధిస్తున్న యువకుడిపై జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణానగర్ సి బ్లాక్‌లో నివసించే ఓ యువతి (23) ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమెకు రెండేళ్ల క్రితం ఇందిరానగర్ నివాసి ఖయ్యూం అనే యువకుడితో స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమె తన అవసరాల రీత్యా అతని వద్ద కొంత డబ్బు తీసుకొని.. కొద్ది రోజులకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసింది.
కొన్నాళ్లకు ప్రేమిస్తున్నానంటూ ఖయ్యూం యువతికి ప్రతిపాదించాడు. ఆమె తిరస్కరించడంతో వేధించడం మొదలుపెట్టాడు. ఉద్యోగం నుంచి ఇంటికి తిరిగి వస్తుంటే తప్పుగా ప్రవర్తించేవాడు. దీనికితోడు ఆమె ఇంట్లోకి చొచ్చుకొని వెళ్లడంతోపాటు చరవాణిని, ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశాడు. తనను ప్రేమించకుంటే సామాజిక మాధ్యమాల్లో కాల్‌గర్ల్ అంటూ వివరాలను పెడతానంటూ తరచూ బెదిరిస్తున్నాడు. ఈ నెల 4వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో యువతి ఇంటి ముందు రహదారిపై నిలబడి ఆమెను దుర్భాషలాడాడు. ఈ విషయమై ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఖయ్యూంపై ఐపీసీ సెక్షన్ 354డి, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.