హైదరాబాద్, : కరోనా నేపథ్యంలో పది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దైన విషయం తెలిసిందే. ఇక మిగిలిన 1 నుంచి 9వ తరగతి చదివే పాఠశాల విద్యార్థులందర్నీ కూడా ఎలాంటి పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేయాలని తెలంగాణ విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. వీరికి పరీక్షలు, ఫలితాలతో నిమిత్తం లేకుండా నేరుగా పై తరగతులకు పంపించాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. 2020-21 విద్యా సంవత్సరానికి 9, 10 తరగతులకు కొత్త అకాడమిక్ క్యాలెండర్‌ను ఈ ఏడాది జనవరిలో పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం మే 26 వరకు స్కూళ్లు నడుస్తాయని, దీని ప్రకారమే 9, 10 తరగతుల వారికి పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. మిగతా తరగతుల విద్యార్థులకు సంబంధించి దీనిపై స్పష్టత లేదు. సాధారణంగా అయితే 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ జూన్ 12 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉంటుంది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇతర విద్యార్థుల విద్యా సంవత్సరం ముగింపునకు ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థు లకు పరీక్షలు ఉంటాయా? ఉండవా? అనే దానిపై స్పష్టత కొరవడింది. విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే వెసులుబాటు ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా వీరికి వార్షిక పరీక్షలు పెట్టే పరిస్థితులు లేనందున ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సోషియో ఎకానమిక్ సర్వేలో వెల్లడించారు. అయితే దీనికి సంబంధించిన ఆదేశాలు మాత్రం పాఠశాలల యాజమా న్యాలకు ఇంకా అందలేదని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటు న్నాయి. 1 నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు దాదాపు 53 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో ఇప్పటికే టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన 2020-21 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 9, 10 తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొన్నది. కానీ 6 నుంచి 8వ తరగతుల వరకు మాత్రం పరీక్షల నిర్వహణపై స్పష్టత ఇవ్వలేదు. 9, 10 తరగతులకు మాదిరిగానే 6-8 తరగతులకు కూడా 2020-21 నూతన అకడమిక్ క్యాలెండర్ సిద్ధం చేస్తున్న క్రమంలో కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడి పరీక్షలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలోనే మిగిలిన తరగతి విద్యార్థులను కూడా పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపించాలని అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే రెండు, మూడు రోజుల్లో వెలువడ నున్నట్లు తెలిసింది.
ప్రైవేట్‌లో ఆన్‌లైన్ పరీక్షలు
ఒక పక్క కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసే యోచనలో అధికారులు ఉంటే మరోపక్క ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కొందరు గుట్టుచప్పుడు కాకుండా వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచించారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదట ఈనెల 16 నుంచే వారికి పరీక్షలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ అవి వాయిదా పడడంతో ఈనెల 26 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో పరీక్షలు రాసి సమాధాన పత్రాలు మాత్రం పాఠశాలలకు నేరుగా విద్యార్థులే తీసుకురావాలని కండీషన్లు పెడుతున్నట్లు తెలిసింది. ఫీజుల కోసమే ఈ విధంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్ధులకు నేరుగా ప్రమోట్…
Advertisement
తాజా వార్తలు
Advertisement