Monday, November 25, 2024

HYD: దళిత శ్మశానవాటికలో ఆక్రమణల‌ కూల్చివేత

రూ.100 కోట్ల భూమిని కాపాడిన ‘ఆంధ్రప్రభ’ కథనం
మణికొండ శివాజీనగర్ లో చర్యలు తీసుకున్న అధికారులు
ఆక్రమణపై గత నెల 15న ‘ఆంధ్రప్రభ’ కథనం
నాడు వెంటనే స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్
చర్యల కోసం ఆర్డీవో, తహసీల్దార్ కు ఆదేశాలు
మణికొండ, ఏప్రిల్ 4(ప్రభ న్యూస్): మణికొండ మునిసిపాలిటీ శివాజీ నగర్ పరిధిలోని దళితుల శ్మశానవాటిక ఆక్రమణకు అడ్డుకట్ట పడింది. ‘ఆంధ్రప్రభ’ కథనంతో రూ.కోట్ల విలువైన శ్మశానవాటిక భూమి అన్యాక్రాంతం కాకుండా ఆగింది. ఈ స్థలంలోని ఆక్రమణలను రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేశారు. కాగా, శ్మశానవాటిక స్థలం కబ్జాకు గురవుతుండడంపై గత నెల 15న ‘ఆంధ్రప్రభ’ కథనం ప్రచురించింది. రూ.కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతం అవుతుండడాన్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో మరుసటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ స్పందించారు. చర్యల కోసం ఆర్డీవో, తహసీల్దార్ లకు ఆదేశాలు ఇచ్చారు.

అనంతరం రెవెన్యూ ఇన్ స్పెక్టర్ తమ టీమ్ తో శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమణదారు చేపట్టిన పనులను నిలిపివేయించారు. భూమి తనదేనని ఏమైనా ఆధారాలు, డాక్యుమెంట్లు ఉంటే తీసుకురావాల్సిందిగా సూచించారు. అయితే, గురువారం వరకు కూడా దీనిపై ఆక్రమణదారు నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. గురువారం శివాజీనగర్ లోని శ్మశానవాటికలో ఆక్రమణలను తొలగించారు. దీంతో దళితులు హర్షం వ్యక్తం చేశారు. ఆక్రమణను వెలుగులోకి తెచ్చిన ‘‘ఆంధ్రప్రభ’’ యాజమాన్యానికి, స్థానిక విలేకరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గత నెల సంచలనం రేపిన ‘‘ఆంధ్రప్రభ’’ కథనం..
మణికొండ శివాజీనగర్ లోని దళితుల శ్మశానవాటిక ఆక్రమణపై గత నెలలో ‘‘ఆంధ్రప్రభ’’లో ప్రచురితమైన కథనం తీవ్ర కలకలం రేపింది. దీంతో వెంటనే సంబంధిత స్థలాన్ని పరిశీలించాలని, ఏమైనా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అడ్డుకోవాలని ఆర్డీవో, తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. దీంతో రెవెన్యూ సిబ్బంది శివాజీ నగర్ లోని శ్మశానవాటిక వద్దకు వెళ్లి పనులను నిలిపివేయించింది. రికార్డులు, ఇతర ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకురావాలంటూ నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్ కు సూచించింది. లేదంటే కూల్చివేతలు చేపడతామని స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement