Thursday, November 21, 2024

తెలంగాణ‌లో క‌రోనా 2.0 ఉగ్ర‌రూపం – వారం రోజుల్లోనే ఆరు రెట్లు కేసులు పెరుగుద‌ల‌..

తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు
24గంటల్లోనే దాదాపు 40శాతం మేర పెరిగిన కేసులు
పాజిటివ్‌ల్లో 47శాతం 20-40ఏళ్లలోపు వారే
రికార్డు స్థాయిలో 887 కేసులు నవెూదు
5వేల మార్కును దాటిన యాక్టివ్‌ కేసులు
కరోనా స్పీడ్‌కు యాక్టివ్‌ కేసులే నిదర్శనం
1700 మార్కును దాటిన కరోనా మృతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కరోనా విలయతాం డవం చేస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ కొనసా గుతున్నా… కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజూ కరోనా కేసుల నమోదులో సరికొత్త రికార్డు నమోదవుతోంది. వారం రోజుల వ్యవథిలోనే ఆరు రెట్ల మేర కరోనా కొత్త కేసులు పెరిగాయి. వారం క్రితం 250కి పైగా కరోనా కేసులు నమోదు కాగా… ఇప్పుడు 887 కేసులు నమోదవడం వైరస్‌ రాష్ట్రంలో ఎంత వేగంగా వ్యాపిస్తోందో స్పష్టమవుతోంది. మరో రెండు మూడు రోజుల్లో రోజువారీ పాజిటివ్‌ కేసులు వెయ్యి దాటే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ఈ నెల 15కల్లా నాలుగు అంకెల స్థాయికి కరోనా కేసులు చేరుకుంటాయన్న ఆందోళన వైద్య నిపుణుల్లో వ్యక్తమవు తోంది. ఈ పరిస్థితుల్లో… రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చేయి దాటిపోతుందా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రం మొత్తం మీద 887 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇంత గరిష్టస్థా యిలో రోజువారీ పాజిటివ్‌ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 684 కేసులు నమోదు కాగా… 24 గంటల వ్యవధిలోనే దాదాపు 40శాతం కేసులు పెరి గాయి. పలు జిల్లాల్లో వారం రోజుల క్రితం వరకు ఒకటి రెండు కరోనా పాజిటివ్‌ కేసులు పరిమితమయ్యేవి. ఇప్పుడు మెజారి టీ జిల్లాల్లో రెండంకెలస్థాయిలో నమోదువుతున్నాయి.
వైరస్‌ స్పీడ్‌కు యాక్టివ్‌ కేసులే నిదర్శనం
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా యాక్టివ్‌ కేసులు కూడా 5 వేల మార్కును దాటాయి. రెండు వారాల క్రితం వరకు దాదాపు రెండు వేల లోపు మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పు డు ఆ సంఖ్య ఐదున్నర వేలకు చేరుకుంది. మార్చి 1వ తేదీన రాష్ట్రంలో కేవలం 1907 కరోనా యాక్టివ్‌ కేసులే ఉండేవి. నెల వ్యవధిలోనే అవి 5వేల మార్కును దాటాయి. ప్రస్తుతం రాష్ట్రం లో 5,511 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో హోం క్వారం టైన్‌లో 2166 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో క రోనా ఉధృతికి యాక్టివ్‌ కేసులే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
కరోనా కేసుల్లో 47శాతం 20-40ఏళ్ల వారే
మరోవైపు కరోనా బారిన పడుతున్న వారిలో 47శాతం మంది 20 నుంచి 40ఏళ్ల మధ్యలోని వారే ఉన్నారు. వీరు ఎక్కువగా కుటుంబ పోషణ కోసం పని చేసే వారే అని వైద్యులు చెబుతున్నారు. వీరిలో కరోనా బారిన పడుతున్న కేసులు 90శా తం అసింప్టమాటికేనని రికార్డులు చెబుతున్నాయి. ఈ నేప థ్యంలో ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే కరోనా టెస్టు లు చేయించుకోవాలని వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. అప్పుడే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందంటున్నారు.
పెరుగుతున్న కరోనా మరణాలు
కరోనాతో మృతిచెందుతున్న వారి సంఖ్య కూడా క్రమం గా పెరుగుతోంది. ఫిబ్రవరి మొదటి వారం వరకు రాష్ట్రంలో కరోనాతో ఒకరిద్దరు మాత్రమే ప్రాణాలు విడిచేవారు. మూడు రోజులుగా ప్రతి రోజూ ముగ్గురు చొప్పున మృతి చెందుతు ీన్నారు. బుధవారం నలుగురు కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1701కు చేరింది. మెదక్‌ జిల్లాలో కరోనాతో ఒకే రోజు ఇద్దరు మృతిచెందారు. పాపన్నపేట మండలం యూసఫ్‌పేటకు చెందిన వ్యక్తి, తూఫ్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌తండాకు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందారు.
జీహెచ్‌ఎంసీలో 201 కేసులు నమోదు
వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ మేరకు బుధవారం అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 201 కేసులు నమోదు కాగా… జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్‌లో 13, జగిత్యాలలో 56, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 79, రంగారెడ్డిలో 76, కామారెడ్డిలో 27, కరీంనగర్‌లో 23, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ 22, మంచిర్యాల 11, నల్గొండ 21, నిజామాబాద్‌లో 45, నిర్మల్‌లో 78, రాజన్న సిరిసిల్లలో 12, సంగారెడ్డిలో 36, సిద్ధిపేటలో 21, సూర్యాపేట, వనపర్తిలో 10, వికారాబాద్‌లో 12, వరంగల్‌ అర్భన్‌ 23, యాదాద్రి భువనగిరి 12 కేసులు నమోదయ్యాయి. బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఐదుగురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. నలుగురు కానిస్టేబుళ్లతోపాటు ఒక హోం గార్డుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇదే పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఏఎస్‌ఐ కరోనాతో మృతిచెందారు. జగిత్యాలలో ఒకేరోజు 101 మంది కరోనా బారిన పడ్డారు. సిరిపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 27మందికి కోవిడ్‌ సోకింది. బంధువు దినకర్మకు ఇటీవల 37మంది కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కరోనా టెస్టులు చేయించుకోగా వారిలో 27మందికి వైరస్‌ సోకింది. దీంతో సిరిపూర్‌లో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేసి, చికిత్స అందిస్తున్నారు. మెట్‌పల్లి పట్టణంలో 26 మందికి కరోనా నిర్ధారణ అయింది.
మాస్కు ఉంటేనే మెడిసన్స్‌
కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మెడికల్‌ షాపుల్లో నో మాస్కు… నో మెడిసిన్‌ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మాస్కు ఉంటేనే మందులు ఇవ్వాలని ఆదేశించింది. దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలతో వచ్చే వాళ్లకు వైద్యుడి ప్రిస్కిప్షన్‌ లేకుండా అమ్మవద్దని తెలిపింది.
క‌రోనాతో మ‌రో యుద్ధం…
కరోనా వైరస్‌ కట్టడికి మరోమారు యుద్ధం చేయాల్సి న పరిస్థితి వచ్చిందని వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సెకండ్‌ వేవ్‌ రూపంలో కరోనా విరుచు కుపడుతున్న నేపథ్యంలో అలుపెరగకుండా పనిచేయాలని వైద్యులను కోరారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెర్శరీ కేర్‌ ఆసుప త్రులు, టీవీవీపీ ఆసుపత్రుల సూపరిం టెండ్లతో గురువారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ”ఇది గంభీరమైన సమ యం. మరోసారి యుద్ధవాతావరణంలో పనిచేద్దాం. కరోనాతో మరణాలు సంభవించకుండా చూద్దాం.” అని అన్నారు. అన్ని ఆసుపత్రుల్లో పీపీఈ కిట్లు, రెమిడిసివిర్‌ ఇంజక్షన్లు, ఎన్‌-95 మాస్కులు, లిక్విడ్‌ ఆక్సిజన్‌ టాంకులు, బల్క్‌ సిలిండర్‌లు, మాత్రలు, వైద్యు లు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కరోనా పేషెంట్లకు బెడ్ల కొరత రాకుండా చూసుకోవాలన్నారు. కరోనా ట్రీట్‌మెంట్‌కు ఎంతమంది సిబ్బంది అవసరం అయినా తాత్కాలిక పద్దతిలో తీసుకోవాలని సూచించారు.
అనంతరం… అన్ని జిల్లాల వైద్యాధికారులతో డీహెచ్‌ డా. శ్రీనివాస్‌తో కలిసి మంత్రి ఈటల టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్ట డంలో గ్రామస్థాయిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియా డారు. గ్రామాల్లో జ్వరం వచ్చిన ప్రతీ ఒక్కరినీ ప్రతీ రోజూ పరిశీలించాలని ఆదేశించారు. వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వారంతా సెలవులకు దూరంగా ఉండా లని స్పష్టం చేశారు. కేంద్ర ప్రబుత్వ ఆదేశాల మేరకు ఆదివారం కూడా వ్యాక్సిన్‌ను పంపిణీ చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న అన్ని జిల్లాల వైద్య అధికారులు అప్రమ త్తంగా ఉండాలన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి మాట్లాడు తూ… రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌కు కొరత లేదన్నారు. అందరికీ వ్యాక్సిన్‌ వేస్తామన్నారు. 45 సంవత్సరాలు పైబడిన వారందరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలన్నారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేష్‌రెడ్డి, డీహెచ్‌ . డా. జీ. శ్రీనివాసరావు, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డా. కరుణాకర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ సాంకేతిక సలహదారు డా. గంగాధర్‌, ఐపీఎం డైరెక్టర్‌ డా. శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement