Tuesday, November 26, 2024

గిన్నీస్‌ బుక్‌ లో పేరు లిఖించుకున్న సీఎస్‌ఐఆర్‌– సీఎంఈఆర్‌ఐ

సౌరశక్తి వినియోగం ప్రోత్సహించడమే లక్ష్యంగా సీఎస్‌ఐఆర్ సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రపంచంలో అతిపెద్ద సోలార్‌ ట్రీ ని అభివృద్ధి చేసింది. దీనిద్వారా సౌర శక్తిని విద్యుత్‌ శక్తిగా మారుస్తారు. ఈ సోలార్‌ ట్రీని పంజాబ్‌లోని లుధియానాలో ఉన్న సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ ఫార్మ్‌ మెషినరీ వద్ద ఏర్పాటు చేశారు. ఈ ట్రీని అధికారికంగా గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వద్ద ప్రపంచంలో అతిపెద్ద సోలార్‌ ట్రీగా నమోదు చేశారు. మొత్తం సోలార్‌ పీవీ ప్యానెల్‌ సర్ఫేస్‌ ఏరియా 309.93 చదరపు మీటర్లుగా దీనిలో నమోదైంది. తద్వారా గతంలోని 67 చదరపు మీటర్ల రికార్డును అధిగమించింది. ఈ సోలార్‌ ట్రీ ఇన్‌స్టాల్డ్‌ సామర్థ్యం 53.6 కిలోవాట్స్‌ పీక్‌గా ఉండటంతో పాటుగా రోజుకు 160–200 యూనిట్ల గ్రీన్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎస్‌ఐఆర్‌–సీఎంఈఆర్‌ఐ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ (డాక్టర్‌) హరీష్‌ హిరానీ మాట్లాడుతూ… ఈ సోలార్‌ ట్రీలో పలు వినూత్నమైన ఆవిష్కరణలు జోడించబడ్డాయన్నారు. అతిపెద్ద సోలార్‌ ట్రీగా గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్స్‌లో భాగం కావడమనేది ఖచ్చితంగా త‌మ కీర్తిసిగలో మరో కలికితురాయిగా నిలుస్తుందన్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన ప్రతి శాస్త్రవేత్తకూ అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. ఈ సోలార్‌ ట్రీలను విస్తృతశ్రేణిలో వినియోగించవచ్చన్నారు. ఈ–ట్రాక్టర్ల చార్జింగ్‌, ఈ–పవర్‌ టిల్లర్స్‌కు చార్జింగ్‌తో పాటుగా సాగునీటి అవసరాల కోసం వ్యవసాయ పంపుసెట్ల నిర్వహణ, వ్యవసాయ క్షేత్రాల వద్ద ఆహార తయారీ అవసరాలను తీర్చడం, వ్యవసాయ దిగుబడులకు అవసరమైన కోల్డ్‌ స్టోరేజీకి సైతం తగిన శక్తిని అందిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement