ఎల్బీనగర్, నవంబర్ 23 ప్రభ న్యూస్ : కేంద్ర మాజీ మంత్రి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు చేస్తూ… ఎల్బీనగర్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డిని గెలిపించాలని కోరారు. వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ కాన్ఫరెన్స్ హాల్లో కమ్మ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పురందేశ్వరి మాట్లాడుతూ… ఎల్బీనగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డిని కమ్మ కుటుంబ సభ్యులందరూ ఆశీర్వదించాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల పోరాటంతో ఏర్పడ్డ తెలంగాణలో.. నీళ్లు నీటిమీద రాతే అయ్యిందన్నారు. మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నిధుల్లేక, ప్రభుత్వం దివాళా తీసే స్థితికి చేరుకుందన్నారు. లక్ష 91 వేల నియామకాలు ఖాళీగా ఉంటే, 80 వేల పోస్టులకు టీఎస్ పీఎస్సీ ద్వారా నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల లీకులతో ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అవినీతి అక్రమాలలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో అన్ని రంగాల్లో విఫలమైందన్నారు.
డబుల్ బెడ్రూమ్ ల కోసం జీహెచ్ఎంసీలోనే ఏడు లక్షల దరఖాస్తులందితే, 75వేలు మాత్రమే నిర్మించి ఇప్పటికీ ఇంకా పూర్తిగా అర్హులకు అందించలేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కృష్ణా నీటి వాటా 211 టీఎంసీలు చాలు అన్న కేసీఆర్.. అనంతరం ప్రధాని మోడీని నిందించడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఒక లక్ష 35 వేల కోట్లతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్రిడ్జ్ కృంగిపోయాయన్నారు. ప్రజల జీవితాలు మన బిడ్డల భవిష్యత్తుతో చెలగాటం ఆడడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించిన నందమూరి తారక రామారావు చరిత్ర సృష్టించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలా విస్తరించారన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని భూములు అమ్మి ఒక వర్గానికి ఇస్తా అనడం ఎంత దౌర్భాగ్యమన్నారు. కాంగ్రెస్ ను ఆదరించి కర్ణాటకలో మోసపోయామని రైతులు తెలంగాణలో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. అటువంటి వారిని మనం అభ్యర్థిద్దామా..? ఒకసారి ఆలోచించాలన్నారు.
ప్రస్తుతం ప్రజాస్వామిక ఓటును వినియోగించి ఎవరికి వేయాలి.. ఎందుకు వేయాలి.. అన్నగారి వారసులుగా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు చేరాలని అన్న స్థాపించిన టీడీపీ, సబ్ కా సాత్ .. సబ్ కా వికాస్ బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఒకే కోవకి చెందినవన్నారు. అన్న నందమూరి తారక రామారావు వారసులుగా మనం మన ఆశీర్వాదాన్ని బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి అందించాలన్నారు. మోడీ నాయకత్వంలో అవినీతి రహిత పాలన కుటుంబ నేపథ్యం లేని పరిపాలన బీజేపీ దేశానికి అందిస్తుందన్నారు. సకల జనుల సౌభాగ్యం బీజేపీ లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిద్దాం అనే సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం కావాలో.. వారసులుగా అన్న ఎన్టీఆర్ రాజ్యం కావాలో ఆలోచించి, స్థానికంగా ఎల్లవేళలా అందుబాటులో ఉండే సౌమ్యుడు మీలో ఒకడైన సామ రంగారెడ్డిని ఆదరించి ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్ కరుణ, డివిజన్ అధ్యక్షులు నూతి శ్రీనివాసరావు, కొత్త రవీందర్ గౌడ్, తడకమల్ల విజయ్ కుమార్, బాలాజీ నాథ్, కమ్మ సంఘం సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.