కొవిన్ రిజిస్ట్రేషన్ కోసం పోటెత్తిన జనం
మే 1 నుండి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ కష్టమే
వ్యాక్సిన్ లభ్యతను బట్టి నిర్ణయం
సీఎం సమీక్ష అనంతరం స్పష్టత వచ్చే అవకాశం
ప్రస్తుతం 45 ఏళ్ల పైబడిన వారికే పూర్తిగా అందని టీకా
హైదరాబాద్, టీకా.. కాక పుట్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగానే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించగా, వ్యాక్సిన్ లభ్యత లేని కారణంగా ఎప్పటి నుండి ఇవ్వాలనే అంశంపై తేదీని ప్రభుత్వం తర్వాత ఖరారు చేయనుంది. కేంద్రం మార్గ దర్శకాల ప్రకారం మే 1వ తేదీ నుంచే ఈ ఉచిత వ్యాక్సిన్ ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. అయితే విస్తృత స్థాయిలో ప్రజలకు టీకాలు అందించడానికి ప్రభుత్వం సన్నద్ధంగా లేకపోవడం, వ్యాక్సిన్ కంపెనీల నుండి ఉత్పత్తి అందకపోవడంతో అన్నీ పరిశీలించి సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. కొవిన్ యాప్‌లో మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించగా, ఒకేసారి లక్షల మంది రిజిస్ట్రేషన్‌కు పోటెత్తడంతో సర్వ ర్లన్నీ క్రాష్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.8 కోట్ల మందికి రెండుడోస్‌ల వ్యాక్సిన్ వేసేందుకు 3.6కోట్ల డోస్‌ల వ్యాక్సిన్లు అవసరం. వ్యాక్సిన్ లభ్యతపై స్పష్టత వచ్చాక.. 18ప్లస్ వయసు ఉన్న వారికి వ్యాక్సిన్ వేసే అంశంపై రూట్ మ్యాప్ ఖరారు చేసే అవకాశాలు న్నాయి. ఇప్పటికే భారత్ బయోటెక్, రెడ్డీ ల్యాబ్స్‌తో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఇటు ప్రజలకు వ్యాక్సిన్ వేయడం, మరోవైపు ఉన్న రోగులకు చికిత్సను అందిం చడం పెద్ద సవాల్‌గా ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 45 ఏళ్ళు పైబడిన వారికే పూర్తిస్థాయి వ్యాక్సిన్ అందని పరి స్థితుల్లో.. మళ్ళీ మూడోదశను ప్రారంభించడం అంటే ప్రభుత్వానికి పెద్ద సవాలే. రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉంది. కేసుల తీవ్రత పెరగడంతో ప్రభుత్వ ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోయాయి. వీరికి చికిత్స చేయడానికి ఉన్న వైద్య సిబ్బంది, నర్సుల సంఖ్య సరిపోవడం లేదు. ఇప్పటికే 114 ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వైద్యసిబ్బంది కొరత ఉన్న పరిస్థితుల్లో భారీ ఎత్తున ప్రారంభం కానున్న టీకాల కార్యక్రమానికి తగిన సంఖ్యలో వైద్య సిబ్బందిని సమకూర్చుకోవడం తేలికైన విషయం కాదని ప్రభుత్వం భావిస్తోంది. పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వైద్యులు, నర్సుల సేవలను వినియోగించుకునేందుకు, ఇందుకోసం వారికి తగిన మొత్తాన్ని చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆరోగ్య విభాగం ఇప్పటికే ఓ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. లక్షల సంఖ్యలో ప్రజలకు టీకాలు వేయాలంటే అందుకు తగిన కార్యా చరణ అవసరం. అందుకే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థల నుంచి పారామెడికోలను కూడా ప్రభుత్వం తీసుకుంటోంది. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో తక్షణం సంబంధిత పోస్టులను భర్తీ చేస్తున్నారు. అవసరమైతే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య ఆస్పత్రుల సిబ్బంది సేవలను కూడా ఈ టీకాల కార్యక్రమానికి ప్రభుత్వం వినియోగించుకుంటుంది. ఉన్న కొవిడ్ రోగులకు అందిస్తున్న చికిత్సలో ఎలాంటి లోపం లేకుండా, రానున్న టీకాల కార్యక్రమానికి సిబ్బందిని సమకూ ర్చుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో నర్సింగ్ సిబ్బంది లభ్యత ఓ పెద్ద సవాల్‌గా ఉంది. అవసరమైతే శిక్షణలో ఉన్న నర్సులను కూడా టీకాల కార్యక్రమానికి రప్పించే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. వ్యవస్థాగతంగా తగిన ఏర్పాట్లు లేకుండా కోట్ల మందికి టీకాలు వేయడం కష్టమని భావిస్తున్న ప్రభుత్వం అందుకు తగిన సన్నాహాలు చేస్తోంది. ఓ వైపు వ్యాక్సిన్ కంపెనీలతో చర్చలు జరుపుతూ, మరోవైపు వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకుంటోంది.