Friday, November 22, 2024

కొత్త కొత్త ల‌క్ష‌ణాలు…మరింత శ‌క్తివంతంగా క‌రోనా వైర‌స్

హైదరాబాద్‌, : కరోనా వైరస్‌ రోజుకో కొత్త లక్షణాలను ప్రదర్శిస్తోంది. ఊసరవెల్లిని మరిపించేవిధంగా కొత్త లక్షణాలు, వేగంగా వ్యాప్తి ని చూపిస్తోంది. గతంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలే కరోనా సోకితే కనిపించేవి. ఇప్పుడు తలనొప్పి, వాంతులు, విరేచనాలతోపాటు నీరసం ఇలా కొత్త లక్షణాలు వెలుగులోకి వచ్చా యి. కరోనా మొదటి వేవ్‌లో కనిపించన లక్షణాలను సెకండ్‌వేవ్‌లో వైరస్‌ చూపిస్తోంది. గతంలో పది మందిలో ఒకరిద్దరికి మాత్రమే వైరస్‌ సోకింది. అయితే ఇప్పుడు ప్రతీ పది మందిలో 8మందికి వైరస్‌ సోకుతోంది. వైరస్‌ సోకిన తర్వాత నెలకొనే అనారోగ్యం కూడా ఈసారి తీవ్రంగా ఉంది. దీంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగు తోంది… చికిత్స అందించేలోపే ప్రాణాలు పోయేవారి సంఖ్యా పెరుగుతూ వస్తోంది. మొదటి వేవ్‌లో పిల్లల జోలికి వెళ్లని వైరస్‌ ఇప్పుడూ… పిల్లా, పెద్ద అందరిపైనా దాడి చేస్తోంది. గతంలో యాక్టివ్‌ కేసులు ఏడాది కాలమైనా 50వేలను దాట లేదు. ఇప్పుడు రెండోవేవ్‌ ప్రారంభమైన నెలలోపే యాక్టివ్‌ కేసులు 60వేలకు చేరుకున్నాయి.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ప్రమాదకరపరిస్థితులకు దారితీస్తున్నాయి. గడిచిన 21 రోజుల్లోనే పాజిటివిటీ రేటు 0.5శాతం నుంచి ఏకంగా 11శాతానికి చేరువలో ఉంది. గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 8061 కేసులు నమోదుకావడంతో పాజిటివిటీ రేటు 10.15శాతంగా నమోదైంది.
ఏప్రిల్‌ మొదటి వారానికంటే ముందు మూడు నెలలు రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.5శాతంగానే ఉండేది. గతేడాది మార్చిలో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు కేవలం 0.45శాతంగానే ఉంది. కరోనా కొత్త వేరియంట్లతో వైరస్‌ వేగంగా విస్తరించడమే పాజిటివిటీ రేటు వేగంగా పెరగడానికి కాఱమైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌, కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండడం కూడా ఇందుకు కారణమవుతోంది. ప్రతి 100 టెస్టుల్లో 10 మందికిపైగానే కరోనా పాజిటివిటీ నిర్ధారణ అవుతోంది. దాదాపు 20 జిల్లాల్లో పాజిటివిటీరేటు 10శాతం నుంచి 20శాతం మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి, నిర్మల్‌, మేడ్చల్‌, నాగర్‌కర్నూలు, యాదాద్రి భువనగిరి, జగిత్యాల,నల్గొండ, నిజామాబాద్‌, సిరిసిల్ల, మంచిర్యాల, మెదక్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో వైరస్‌ విలయాన్ని సృష్టిస్తోంది. దీంతో ఈ జిల్లాల్లో పాజిటివిటీ రేటు 20శాతం దాకా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement