Friday, November 22, 2024

గదుల్లో వైర‌స్ మేఘాలు – క‌ళ్ల ద్వారా కూడా క‌రోనా ఎంట్రీ….

హైదరాబాద్‌, : కరోనా వైరస్‌ గాలిలో మబ్బుల మాదిరిగా ఏర్పడి భవనాలు, ద్వారాలు మూసి ఉంచిన గదుల్లో వ్యాపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్‌ క్లౌడ్స్‌ ఇంట్లోనే ఏర్పడుతాయని, ఆరుబయట ప్రదేశాల్లో ఏర్పడే అవకాశం లేదంటున్నారు. ఆరుబయట ప్రదేశాల్లో వైరస్‌ ముందుకు కదలడం గాని, గాలిలో పైకి లేవడం కాని జరుగుతుందని చెబుతున్నారు. గాలిలో మబ్బుల్లాగా ఏర్పడిన వైరస్‌ ఒకగది నుంచి గాలి ద్వారా మరొక గదికి వ్యాపిస్తుందని తేల్చారు. గదిలోని గాలిలో వైరస్‌ మూడుగంటలపాటు జీవిస్తోందంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఒకరికి వైరస్‌ సోకితే అందిరికీ సోకే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవనాలు, మూసి ఉంచిన గదులు, ఆఫీసుల్లో పనిచేసే, నివసించే ప్రజలు వీలైనంత వరకు గాలి ప్రవాహం దారాళంగా వచ్చేలా చూసుకోవాలని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డా. శ్రీనాథ్‌రెడ్డి అంటున్నారు. వీలైనంత వరకు తలుపులు, కిటికీలు తెరిచి గాలి వచ్చేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలంటున్నారు.
రెమ్‌డెసివిర్‌ ప్రాణాలు కాపాడలేదు
రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ తీసుకున్నంత మాత్రాన కోవిడ్‌తో ప్రాణభయం తొలగిపోదని, కరోనా నుంచి మనుషుల ప్రాణాలను కాపాడే శక్తి రెమ్‌డెసివిర్‌కు లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికాలో ఇప్పటికే రెమ్‌డెసివిర్‌పై పరిశోధనలు జరిగాయని, రెమ్‌డెసివిర్‌ ప్రాణాపాయం నుంచి కాపాడలేకపోతోందని తేలిందంటు న్నారు. రెమ్‌డెసివిర్‌ ద్వారా కరోనా నుంచి కోలుకునే సమ యం కాస్త తగ్గుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కోసం పరుగెత్తాల్సిన అవసరం లేదంటున్నారు. ఆస్పత్రిలో చేరిన వారే రెెమ్‌డెసివిర్‌ను వాడాలని, ఇంట్లో ఉన్న వారు వాడితే ప్రాణాలకే ప్రమా దమని హెచ్చ రిస్తున్నారు.
కుటుంబాలకు కుటుంబాలే బలి
రాష్ట్రంలో కరోనా వైరస్‌ కుటుంబాలకు కుటుంబాలనే బలి తీసుకుంటోంది. జగిత్యాలలో ఒకే కుటుంబంలో ముగ్గురు కరోనాకు బలయ్యారు. మిగతా ముగ్గురు కుటుంబ సభ్యులు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సీనియర్‌ పాత్రికేయులు, ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మాజీ సభ్యుడు కోసూరి అమర్‌నాథ్‌ కరోనాతో మృతి చెందారు. వనపర్తి జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మునిసిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో ఒకేరోజు వంద మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధా రణ అయింది. తెలంగాణలో కరోనా సెకండ్‌వేవ్‌ సామా న్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరీని వదలడం లేదు. తాజాగా వైరస్‌ జర్నలిస్టులపై కోవిడ్‌ పంజా విసురుతోంది. సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన బుర్ర రమేష్‌, కరీంనగర్‌ పట్టణానికి చెందిన పడకంటి రమేష్‌ కరోనాతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.
రాష్ట్రానికి 1600 టన్నుల ఆక్సిజన్‌
రాష్ట్రంలో ఆక్సిజన్‌ అవసరమవుతున్న కోవిడ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతి రోజూ 400 టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరమవుతోంది. అయితే రాష్ట్రంలో వివిధ మార్గాల ద్వారా 150 టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే అందుబాటులో ఉండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరతను, రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తికి అవసరమైన ఆక్సిజన్‌ను అందించేందుకు బళ్లారికి చెందిన జిందాల్‌ ప్రాక్సేర్‌ కంపెనీ ముందుకు వచ్చింది. జిందాల్‌ కంపెనీ 1600 టన్నుల ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను హైదరాబాద్‌కు యుద్ధప్రాతిపదికన పంపించింది. డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆదేశాల మేరకు హెటిరో డ్రగ్స్‌, మైలాన్‌ ల్యాబ్స్‌కు ఆక్సిజన్‌ ట్యాంకర్లు చేరుకున్నాయి. ఈ ఫార్మా కంపెనీలు మరో రెండు రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించేందుకు డీసీఏ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో 160 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. జడ్చర్లలోని ఎల్లానేబరీ, ఐనాక్స్‌ కంపెనీలు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా మరిన్ని ఆక్సి జన్‌ యూనిట్ల అవసరం ఉందని వైద్యవర్గాలు చెబుతున్నాయి.
రూటు మార్చి.. చిన్నారులే టార్గెట్‌గా
కరోనా వైరస్‌ రూటు మారు స్తోంది. ఇప్పటి వరకు వైరస్‌ పెద్దలకే ఎక్కువగా వ్యాపిస్తోందని, వారిలోనే తీవ్ర అనారోగ్యానికి కారణమవుతోందని అంతా భావిస్తున్నారు. చిన్న పిల్లలకు కరోనా సోకినా ఆరోగ్యం తీవ్రంగా విషమించదని అనుకుంటున్నారు. కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈ అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. అయితే కరోనా సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో ఇప్పుడు భయపెట్టే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం చాలా వరకు చిన్న పిల్లలు కూడా వైరస్‌ బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవడంతో ఎక్కువగా విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేసింది. అయితే కరోనా సోకిన విద్యార్థుల నుంచి మెజారిటీ ప్రజలకు వైరస్‌ వ్యాప్తి చెందిందని తెలియడంతో అధికారులు షాకవుతున్నారు. కరోనా వైరస్‌ తీవ్రత, వ్యాప్తి గతంలో ఉన్నట్లు ఇప్పుడు లేదు. వైరస్‌లో చాలా మ్యుటేషన్లు చోటు చేసుకుం టున్నాయి. ఫలితంగా ఇప్పుడు కరోనా వైరస్‌ పెద్ద వారితోపాటు చిన్నపిల్లలకు కూడా ఎక్కువగా సోకుతోంది. మ్యుటేషన్‌ చెందిన వైరస్‌ ఇప్పుడు రూటు మార్చింది. చిన్న పిల్లలనే టార్గెట్‌ చేస్తోంది. వారిలో తీవ్రంగా ఇన్‌ఫెక్షన్లు కలుగజేస్తోంది. రూపాంతరం చెందిన వైరస్‌ చిన్నారుల్లో బలమైన రోగనిరోధక శక్తి ఉన్నా సోకుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్నారుల శరీరంలోని రోగనిరోధక శక్తిని అణిచివేస్తూ పై చేయి సాధిస్తున్న వైరస్‌ శరీరంలోని వివిధ అవయవాల కణజాలంలోకి సులువుగా జొరబడుతోంది. వైరస్‌ సోకిన చిన్నారుల్లో దగ్గు, జ్వరం, జలుబుతోపాటు తీవ్రమైన జ్వరం, చర్మంపై దద్దుర్లు, కళ్లు ఎరుపెక్కడం, ఒళ్లు నొప్పు లు, కీళ్ల నొప్పులు, వికారం, పెదవులు ఎరుపెక్కడం, పెదవులు పగలడం వంటి లక్షణాలు బహిర్గతం అవుతున్నాయి.
కళ్ల ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి
కరోనా వైరస్‌ కళ్ల ద్వారా కూడా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కళ్లలొకి వైరస్‌ ప్రవేశించకుండా కళ్లద్దాలు ధరించాలని, లేదంటే ఫేస్‌ షీల్డ్‌ ధరించాలని చెబుతున్నారు. కళ్ల నుంచి ముక్కుకు ప్రత్యేక ద్వారం ఉంటుందని, కళ్లలో చేరితే ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి వైరస్‌ చేరే ప్రమాద ముందంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement