Saturday, November 23, 2024

Corona కల్లోలం.. ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు మృతి..!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కలకలం సృష్టిస్తోంది. జేఎన్‌.1 వేరియంట్‌ వెలుగులోకి వచ్చాక రాష్ట్రంలో తొలి కరోనా మరణాలు సంభవించాయి. ఉస్మానియా ఆసుపత్రిలో కొవిడ్‌తో ఇద్దరు రోగులు ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. అనారోగ్య సంబంధిత వ్యాధులతో ఇద్దరు పేషెంట్లు వైద్యం కోసం ఉస్మానియాలో చేరగా… వారిలో శ్వాసకోశ సమస్యలు తీవ్రమవడంతో ప్రాణాలు విడిచారు.

మృతులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని వైద్యులు తెలిపారు. మృతులను 60ఏళ్లు, 40ఏళ్ల వ్యక్తులుగా గుర్తించారు. మరో ముగ్గురు రోగులు కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు పీజీ మెడికోలకు కూడా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో వారిని వైద్యులు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంచారు. పీజీ మెడికోల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు.

ఏడాదిన్నర తర్వాత తొలి కరోనా మరణాలు…

- Advertisement -

దాదాపు ఏడాదిన్నర తర్వాత తెలంగాణలో కరోనా మరణాలు నమోదయ్యాయి. ఉస్మానియా ఆసుపత్రిలో ఊపిరితిత్తుల వ్యాధితో చేరిన రోగి మృతిచెందాడు. రోగికి చేసిన వైద్య పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయింది. కరోనా మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాదపడుతున్న వారు ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జన సమూహాలకు దూరంగా ఉండాలని, మాస్కు ధరించాలని హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంచేందుకు సంతులిత ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

55 కరోనా యాక్టివ్‌ కేసుల్లో 44 హైదరాబాద్‌లోనే…

రాష్ట్రంలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన వారం రోజుల్లోనే ఏకంగా 55 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 వేగంగా వ్యాప్తిచెందుతుండడంతోనే కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. నమోదైన 55 కరోనా కేసుల్లో 90శాతానికి పైగా కేసులు హైదరాబాద్‌ నగరంలోని నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 55 యాక్టివ్‌ కేసులు ఉండగా ఇందులో 44 కేసులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement