ఎవరి జాగ్రత్తలో వారు ఉండాల్సిందే
హెచ్చరిస్తున్న వైద్యనిపుణులు
ఆస్పత్రులు ఫుల్.. పోటెత్తుతున్న పేషెంట్లు
మందుల కొరత.. చిన్నపిల్లలకూ వైరస్
18 వేల నుండి 38 వేలకు పెరిగిన బెడ్లు..
మరో రెండు రోజుల్లో 53 వేలకు పెంపు
గాలి ద్వారానే తీవ్రత పెరుగుతోంది: సీసీఎంబీ సీఈవో మధుసూదన్‌రావు
హైదరాబాద్, : కరోనా సెకండ్ వేవ్ గజగజలాడిస్తోంది. పక్షంరోజుల్లోనే కేసులు డబుల్ కాగా.. గత ఏడాది రికార్డులన్నీ బద్దలు కొట్టి భారీగా కేసులు నమోదమవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య వందల నుండి వేలకు చేరింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా పట్ల అందరూ అప్ర మత్తంగా ఉండాలని కీలక సూచనలు చేస్తోంది. కరోనా వెళ్ళిపోయిం దని ప్రజలు భావించి అలసత్వంగా ఉండడమే ఈ కేసుల పెరుగుదలకు కారణమని ప్రభుత్వవర్గాలు విశ్లేషిస్తున్నాయి. జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించే పరిస్థితిలో లేవని, మరో ఆరువారాలు జూన్ దాకా ప్రజలే స్వీయలాక్ డౌన్ విధించుకుని అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 5 వేలకు చేరగా, ప్రతిరోజూ అధికారికంగా.. అనధికారికంగా కరోనా కారణంగా మృతి చెందుతున్న రోగుల సంఖ్య 50కు పైగానే ఉంటోందని లెక్కలు చెబుతున్నాయి. కొత్త మ్యుటె షన్లతో కరోనా సోకిన వారికి.. పరిస్థితి విషమంగా మారు తుండగా, ఐసీయూ బెడ్లు.. ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను ఆస్ప త్రులలో అనూహ్యంగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సెకండ్ వేవ్‌కు ముందు రాష్ట్రంలో 18 వేల బెడ్లు ఉండగా, సెకండ్ వేవ్ తీవ్ర రూపు దాల్చడంతో బెడ్ల సంఖ్యను ప్రభుత్వం 38 వేలకు పెంచారు. మరో రెండురోజుల్లో వీటిసంఖ్య 53 వేలకు పెంచేలా వైద్యశాఖ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కృత్రిమ కొరత సృష్టించి.. లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ఆక్సిజన్ పెడితే రోజుకు రూ.60 వేలు, వెంటిలేటర్ పెడితే డైలీ రూ.80 వేల నుండి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ఇలా బెడ్ దొరకాలంటే ముందు కొన్ని ఆస్పత్రులు రూ.3 లక్షల నుండి 5 లక్షల వరకు డిపాజిట్ అడుగుతున్నాయి.
అలసత్వమే డేంజర్
కరోనా వెళ్ళిపోయిందని ప్రజలు ఇష్టానురీతిగా వ్యవహ రించడం, కనీసం మాస్క్ కూడా ధరించకపోవడంతో కరోనా కరాళనృత్యం చేస్తోంది. సరికొత్త మ్యుటేషన్లతో దాడిచేస్తోంది. గాలి నుండి కూడా కరోనా వ్యాపించే దశకు చేరింది. ఇంట్లో ఉన్నా కూడా.. కుటుంబసభ్యులకు వైరస్ విస్తరించి మొత్తం కుటుంబాన్ని పడుకోబెడుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెంద డంవల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని తాజా పరిశో ధనల్లో గుర్తించారు. సినిమా థియేటర్స్, మాల్స్, హోటల్స్, మెట్రో రైల్స్ ఇలా సమూహంగా ఉన్న పరిస్థితులే వైరస్ విస్తరణకు ప్రధాన కారణమని అధికారవర్గాలు ప్రభుత్వానికి నివేదిక కూడా అందించాయి. పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సెలవుల రద్దుకు ప్రభుత్వం యోచిస్తోంది.
20మంది 433మందికి అంటించారు
మహారాష్ట్ర నుంచి ఓ ఉత్సవం నిమిత్తం సరిహద్దు నిజామా బాద్ జిల్లాకు మార్చి 24న 20 మంది వచ్చారు. అక్కడ జరిగిన ఆ ఉత్సవంలో సరిహద్దు జిల్లాకు చెందిన మరో 30 మంది పాల్గొన్నారు. వారిలో కరోనా లక్షణాలు కనిపించడంలో పరీక్ష లు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ ఐదుగురి కాంట్రాక్ట్స్‌ను గుర్తించగా మరో 34 మందికి కరోనా సోకినట్లు తేలింది. అలా 34 మంది 433 మందికి కరోనా వ్యాపించింది. ఇదంతా కేవలం 12 రోజుల్లోనే జరిగిపోయింది.
ఆక్సిజన్ కొరత లేదు..
రాష్ట్రంలో కోవిడ్ చికిత్సకు పడకలు, మందులు, ఆక్సిజన్ కొరత లేదు. 116 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స కొన సాగుతుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో శ్రీనివాస్‌రావు మీడి యాతో మాట్లాడారు. కరోనా రెండో దశ వ్యాప్తి ఉధృతం గా ఉంది. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు కూడా కరోనా ముందు మోక రిల్లుతు న్నాయి. కరోనా తొలి దశ నుంచి ప్రజలు పాఠా లు నేర్చుకోలేదు. కరోనా వెళ్లిపోయిందనే భ్రమ లో జనం ఉన్నారు. మొదటి వేవ్‌ను ఎంతో కొంత అడ్డుకో లిగాం. ప్రజ ల్లో అలసత్వం వచ్చింది. గాలి నుంచి వ్యాపిం చే దశకు కరోనా చేరుకుందని పేర్కొన్నారు. కొత్త మ్యుటేషన్ల కారణంగా కరో నా వేగంగా వ్యాపిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మా స్కు ధరించాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా బెడ్ల కొర త లేదని, కేవలం 15-20 కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే పడకల కొరత ఉందని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఐదు కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచుతామని ప్రకటించారు. 80 శాతం మంది కరోనా బాధితుల్లో ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించారు.
శ్వాస ద్వారా కూడా వైరస్ వ్యాప్తి – – సీసీఎంబీ సిీఈవో మధుసూదన్‌రావు
కరోనా వైరస్ గాలి ద్వారా విస్తరిస్తుందని సీసీఎంబీ పరిశోధనల్లో స్పష్టమైందని సీసీఎంబీ సీఈవో డాక్టర్ మధుసూదన్‌రావు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంవల్లే రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. దగ్గు, తుమ్ముల ద్వారానే కాకుండా వైరస్ ఉన్న వ్యక్తి మాట్లాడిన శ్వాస ద్వారా కూడా వైరస్ గాలిలో విస్తరిస్తోందన్నారు.