హైదరాబాద్, : రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రళయాన్ని సృష్టిస్తోంది. భారీగా రోజువారీ పాజిటివ్ కేసుల పెరుగుదల, రికవరీరేటుగ్గుదల, పెరుగుతున్న మరణాలు ఇలా… అన్ని విధాలుగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. గడిచిన 24 గంటల్లో 5567 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో వైపు రోజు రోజుకు కరోనాతో మృతిచెందుతున్న వారి సంఖ్య పెరుగు తూనే ఉంది. మరో 23 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. తాజాగా 2,251 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. మరో వైపు యాక్టివ్ కేసులు 50వేలకు చేరువయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 49,781 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో నిన్న ఒకే రోజు 1, 02,335 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 989, మేడ్చల్‌లో 421, రంగారెడ్డిలో 437, నిజామాబాద్‌లో 367, మహబూబ్‌నగర్‌లో 258 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి.
కరోనా కేసులు, మరణాల పెరుగుదలకు తోడు… ఆసుప త్రుల్లో కరోనా ఎమర్జెన్సీ పేషెంట్లకు బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు ఆక్సిజన్ లభించడం లేదు. దీనికితోడు రాష్ట్రంలో యాంటిజెన్ కిట్ల కొరతతో కరోనా టెస్టులు తగ్గుముఖం పట్టాయి. టెస్టింగ్ కేంద్రాల వద్ద జనం క్యూ కడుతున్నారు. చేసిన టెస్టులకు కూడా రిపోర్టులు రోజుల తరబడి ఆలస్యం అవుతుండడంతో హోం ఐసోలేషన్‌లో పరిస్థితి విషమించిన రోగులకు ఆసుపత్రుల్లో అడ్మిషన్ దొరకడం లేదు.
50వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
జెట్ స్పీడ్‌తో పెరుగుదల
రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్ కరాళ నృత్యానికి పెరుగు తున్న యాక్టివ్ కేసులే సాక్ష్యంగానిలుస్తున్నాయి. కేవలం మూడువారాల్లోనే యాక్టివ్ కేసులు 7 రెట్లు పెరిగాయి. కరోనా యాక్టివ్ కేసులు జెట్‌స్పీడ్‌తో పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్ ప్రారంభమైన మూడు వారాల వ్యవథిలోనే యాక్టివ్ కేసులు 50వేలకు చేరువవడం వైద్య వర్గాల్లో తీవ్ర ఆందోళనలను కలిగిస్తోంది. గతేడాది మార్చి 2 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 2 వరకు అంటే సంవత్సరం వరకు కూడా రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు ఈ మూడు వారాల్లో నమోదైనన్నీ నమోదు కాలేదు. కేవలం 21 రోజుల వ్యవథిలోనే కరోనా రాష్ట్రంలో విలయం సృష్టిస్తోం దనడానికి 50వేలకు చేరువయిన యాక్టివ్ కేసులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోవిడ్-19 సెకండ్ వేవ్ మొదలయిన ఏప్రిల్ మొదటివారంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7వేల లోపే ఉంది. ఉన్నపళంగా 21 రోజుల్లో ఏకంగా 46వేలకు యాక్టివ్ కేసులు చేరుకున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంటే 21 రోజుల్లో నే 7 రెట్లు యాక్టివ్ కేసులు పెరిగాయంటే వైరస్ ప్రభావం ఎంత ప్రమాదకరస్థాయిలో ఉందో తెలుస్తోందని రా ష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ జీ. శ్రీనివాసరావు అన్నారు.
ప్రస్తుతం అధికారికంగా నమోదైన యాక్టివ్ కేసులే 50వేలకు చేరువలో ఉంటే… అనధికారికంగా ఇంతకు రెండు రెట్లు అధికంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. యాక్టివ్ కేసుల్లో అత్యధిక బాధితులు ప్రయివేటు ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. కేవలం మొత్తం యాక్టివ్ కేసుల్లో కేవలం 1వంతు మంది మాత్రమే హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
మళ్లి మైక్రో కంటైన్మెంట్ జోన్లు…
రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్ కరాళ నృత్యం చేస్తుండడంతో కరోనా కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైరస్ కట్టడి చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా మరోసారి మైక్రోకంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి 491 మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ 11, భద్రాద్రి కొత్తగూడెం 13,హైదరాబాద్ 67, జగిత్యాల 7, జనగామ 2,జయశంకర్ భూపాలపల్లి 10, జోగులాంబ గద్వాల 8 కామారెడ్డి 2, కరీంనగర్ 10, ఖమ్మం 25, కొమరంభీం ఆసీఫాబాద్ 20, మహమూబ్‌నగర్ 4, మంచిర్యాల 12, మెదక్ 7, మేడ్చల్ మల్కాజిగిరి 28, ములుగు 18, నాగర్‌కర్నూలు 12, నల్గొండ 16, నారాయణపేట 37, నిర్మల్ 32, నిజామాబాద్ 67, పెద్దపల్లి 7, రాజన్నసిరిసిల్ల 9, రంగారెడ్డి 25, సంగారెడ్డి 4, సిద్ధిపేట 1, సూర్యాపేట 20, వికారాబాద్ 27, వికారాబాద్ 27, వనపర్తి 2, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్భన్ 10, యాదాద్రి భువనగిరి 13.
రాష్ట్రంలో కరోనా విప్కతర పరిస్థితులు…
కరోనా మహమ్మారికి మరో అటవీశాఖ ఉద్యోగి బలయ్యారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం నార్త్ రేంజ్‌లో విధులు నిర్వహిస్తున్న ఫారెస్టు బీట్ ఆఫీసర్ పద్మ కరోనాతో మృతి చెందారు. కరోనా విజృంభిస్తుండడంతో వేముల వాడ పట్టణంలో ఈ నెల 22 నుంచి మే 1 వరకు పాక్షికంగా లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వేముల వాడ దర్శనానికి మే 2 వరకు ఆగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 110 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
కరోనా టెస్టులు తగ్గుముఖం
టెస్టింగ్ సెంటర్ల వద్ద జనం క్యూ
మరోవైపు పీహెచ్‌సీల్లో కరోనా టెస్టులు తగ్గుముఖం పట్టాయి. కరోనాకిట్లకు కొరత ఏర్పడడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సెకండ్‌వేవ్ భయంకరంగా వ్యాపిస్తుండడంతో సామాన్య, పేద ప్రజలు టెస్టుల కోసం పీహెచ్‌సీల వద్ద క్యూకడుతున్నారు. దీంతో అధికారులు టోకెన్ సిస్టం ప్రవేశపెట్టారు. అయితే ముందు రోజు టోకెన్ ఇచ్చిన వారికి కూడా మరుసటి రోజులు టెస్టులు చేయలేకపోతుండడం గమనార్హం. అయితే ఈ విషయమై వైద్య, ఆరోగ్యశాఖ టీఎస్‌ఎంఐడీసీ అదికారులను సంప్రదించగా సరిపోయినన్ని రాట్ కిట్లకు ఆర్డర్ పెట్టామని, ఎక్కడా కొరతలేవని చెబుతున్నారు.
టెస్టింగ్ రిపోర్టులు రోజుల తరబడి ఆలస్యం…
పరిస్థితి విషమిస్తే ప్రాణాలు పోవాల్సిందే…
మరోవైపు ర్యాపిడ్ యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టుల రిపోర్టులు రోజుల తరబడి ఆలస్యం అవుతుండడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాజిటివిటీ రిపోర్టు ఉంటేనే ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుంటామని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులు తెగేసిచెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టెస్టింగ్ కేంద్రాల్లో అధికారులు మౌఖికంగానో, ఆధార్‌కార్డు జిరాక్స్ పైనో పాజిటివ్ అని రాసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లకు ఒక్కసారిగా పరిస్థితి విషమించిన సందర్బాల్లో వారిని ఆసుపత్రులకుతీసుకెళ్తే పాజిటివిటీ రిపోర్టు చూపించాలని, లేని పక్షంలో మరోసారి టెస్టు చేయించుకొని రిపోర్టు తో రావాలని వైద్యులు, ఆసుపత్రుల యాజమాన్యాలు తెగేసి చెబుతుండడం రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇదే విధంగా సోమవారం గాంధీలో శామీర్‌పేటకు చెందిన ఓ 50ఏళ్ల మహిళ వద్ద పాజిటివిటీ రిపోర్టు లేకపోవడంతో గాంధీ వైద్యులు చేర్చుకునేందుకు నిరాకరించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తెలంగాణలో మూడు వారాల్లో ఏడు రెట్లు కరోనా కేసులు…
Advertisement
తాజా వార్తలు
Advertisement