Monday, November 18, 2024

అంబులెన్స్ ల మోత‌తో హ‌డ‌లెత్తిపోతున్న జ‌నం.

హైదరాబాద్‌, : మహానగరం రహదారులు ఎన్నో విపత్తులు.. మరెన్నో ఉద్యమాలకు సజీవ సాక్ష్యాలు. వందల ఏళ్లనాటి చారిత్రక సోయగాలకు, శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు వేదిక ఇది. ఎన్నో వైపరీత్యాలను తట్టుకుని ముందుకు సాగుతున్న నగరం హైదరాబాద్‌. లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. సామా న్యుడి నుంచి సంపన్నుల వరకూ అక్కున చేర్చుకుని ఆకలి తీరుస్తోంది. భవిష్యత్‌కు బోలెడంత భరోసా కల్పిస్తోంది. ఇప్పుడు కరోనా మహమ్మారితో లక్షలాది మందికి ఉపాధినిచ్చే హైదరాబాద్‌ నగరం అతలాకుతలం అవుతోంది. నిత్యం లక్షలాది వాహనాలతో 24 గంటలు ఎప్పుడు సందడిగా ఉండటం అటుంచి.. అంబులెన్స్‌ల మోతతో ఆగమాగం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరగడం.. గతేడాది కంటే సెకండ్‌ వేవ్‌లో మరణాల సంఖ్య పెరుగుతున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కూడా విధించడంతో పాటు నగరవ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో అంతటా నిశ్శబ్దం అలుముకున్నది. ఇంతటి చీకటిలో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున వరకు అంబులెన్స్‌ల సైరన్ల మోతలతో నగరంలో కరోనా హోరును ప్రతిబింబిస్తున్నా యి. కరోనా బాధితులను ఆస్పత్రులకు తీసుకెళ్లేవి కొన్ని.. ఆఖరి క్షణాల్లో ఉన్న వారిని మెరుగైన ఆస్పత్రులకు మార్చేవి మరికొన్ని.. మహమ్మారితో పోరాడి ఓడిన వారి మృతదేహాలను శ్మశాన వాటికలకు తరలించేవి ఇంకొన్ని.. ఇలా ఎప్పుడు చూసిన అంబులెన్స్‌ల సైరన్‌ మోతలతో మహానగర ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. కరోనా కరళానృత్యంతో కళ్లెదుటే వందలాది మంది కన్ను మూస్తున్నారు. కిక్కిరిసిన ఆస్పత్రులు, ఆరుబయట రోదన లు.. ఖాళీలేని పలు శ్మశానవాటికల వద్ద పరిస్థితిని చూస్తూ మౌనంగా దు:ఖిస్తూ కన్నీరు పెడుతున్న పరిస్థితి కనిపి స్తోంది. నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మనిషికి ఏ రోగం వచ్చినా.. ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ లేదా ఇతర వాహనం వస్తే.. కరోనా వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. స్థానికులు భయాందోళనకు గురవుతూ ఇంటి నుంచి బయటకు రావడానికే జంకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మాయదారి రోగం ఎటు నుంచి ఎక్కడ కబళిస్తోందననే భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ప్రజలు బయటికి రావడానికి జంకుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement