ఉదయం నుంచి సెగలు, పొగలు కక్కిన సూర్యుడు సాయంత్రానికి చల్లవడ్డడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయ్యింది. హైదరాబాద్ సిటీ చుట్టుపక్కలు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిశాయి. దీంతో తెలంగాణను తొలకరి పలకరించినట్టేనా అని చాలామంది అనుకుంటున్నారు. కాగా, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జీడిమెట్ల, సూరారం, బహదూర్‌పల్లి, నేరేడ్‌మెట్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట, చిలుకలగూడ, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
కీసరలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురువగా.. ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టాయి. దీంతో జనం ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడగా జనం ఉక్కపోత నుంచి ఊరట పొందారు. ఇదిలా ఉండగా.. రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.