Tuesday, November 26, 2024

హెచ్‌వీడీఎస్‌తో నష్టాలకు చెక్.!

హైదరాబాద్‌ మహా నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న విద్యుత్‌ నష్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముందుగా సాంకేతిక నష్టాలను అధిగమించాలని, అప్పుడే విద్యుత్‌ చౌర్యం పరిస్థితి అవగతమవుతుందని విద్యుత్‌ అధికారులు భావిస్తున్నారు. సాంకేతికతతో వస్తున్న నష్టాలకు చెక్‌ పెట్టడానికి కేంద్రం ఆర్‌డీఎస్‌ పథకాన్ని ప్రకటించింది. దీనివల్ల సాంకేతిక నష్టాలను ఎంత మేరకు తగ్గించగలమనే విషయాలపై విద్యుత్‌ ఇంజనీర్లు పరిశీలిస్తున్నారు. హై వోల్టేజీ డిస్ట్రి బ్యూషన్‌ సిస్ట మ్‌(హెచ్‌వీడీఎస్‌) ట్రాన్స్‌ఫార్మర్లతో విద్యుత్‌ చౌర్యాన్ని నివారించవచ్చని భావిస్తున్నారు. కొత్తగా ప్రకటించిన ఆర్‌డీఎస్‌ పథకంలో 2024-25 నాటికి పెరిగిపోతున్న వాణిజ్య, పంపిణీ నష్టాలను 12-15 శాతానికి తగ్గించాలని డిస్కంలకు లక్ష్యాలను నిర్ధేశిస్తూ, అవసరమైన నిధులను అందజేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఆర్‌డీఎస్‌ పథకంలో ఇంకా చేరనప్పటికి తెలంగాణలోని ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ డిస్కంలు కలిపి రూ.18వేల కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించాయి. ఆర్‌డీఎస్‌లో ప్రధానంగా నష్టాలను తగ్గించడానికి ఫ్రీపెయిడ్‌ మీటర్ల బిగింపుతో పాటు హెచ్‌వీడీఎస్‌తో ప్రయత్నించాలని, వీటివల్ల ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని విద్యుత్‌ ఇంజనీర్లు పేర్కోంటున్నారు. ముందుగా విద్యుత్‌ నష్టాలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రయోగాత్మకంగా ఆర్‌డీఎస్‌ పథకంలో భాగంగా హెచ్‌వీడీఎస్‌ను ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. విద్యుత్‌ నష్టాలు అధికంగా ఉన్న హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌లో కొన్ని ఫీడర్లలో మీటర్లు యధావిధిగా పని చేస్తున్నాయి. పైకి చూడడానికి అంతా బాగానే కనిపిస్తున్న ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి వెలుతున్న విద్యుత్‌కు, ఇళ్లల్లోని మీటర్లలో నమోదవుతున్న రీడింగ్‌కు పొంతన కుదరడం లేదు. కొన్ని ఫీడర్లలో అయితే 80నుంచి 90శాతం విద్యుత్‌ లెక్కల్లోకి రావడం లేదు. సౌత్‌ సర్కిల్‌లో సగటున 40శాతం విద్యుత్‌ నష్టాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇళ్లల్లో మీటర్లు ఉండడం వల్ల మీటర్‌ వద్దనే ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారని అధికారులు గుర్తించారు.

దీనిని అరికట్టడానికి గతంలో పాత బస్తీలో విద్యుత్‌ స్తంభాలకే మీటర్లు బిగించారు. కానీ కొంతమంది కిందిస్థాయి సిబ్బంది వినియోగదారులతో చేతులు కలిపి ఈ ప్రయత్నాన్ని నీరుగార్చారు. తిరిగి దాదాపు అదే విధానాన్ని అమల్లోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. విద్యుత్‌ నష్టాలను అధిగమించడానికి, విద్యుత్‌ చౌర్యం ఎక్కడ ఉందో గుర్తించడానికి హెచ్‌వీడీఎస్‌ ట్రాన్స్‌ఫార్మర్లను బిగించడానికి సిద్ధమవుతున్నారు. 25కేవీఏ సామర్థ్యం కలిగిన హెచ్‌వీడీఎస్‌ చిన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనిని బిగించడానికి ఎలాంటి గద్దెను నిర్మించాల్సిన అవసరం లేదు. విద్యుత్‌ స్తంభంపైనే ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగిస్తారు. దాని నుంచి ఐదు ఇళ్లకు మాత్రమే విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తారు. నష్టాలు ఎక్కువ నమోదవుతున్న ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి అపార్ట్‌మెంట్లకు కనెక్షన్‌ ఇస్తున్న విధంగా లోడును బట్టి 5 ఇళ్లకు కనెక్షన్‌ ఇస్తారు. ఆ వినియోగదారులకు ఫ్రీపెయిడ్‌ మీటర్లు బిగిస్తారు. ఆ మీటర్లు కూడా ఎవరి ఇళ్లల్లో కాకుండా ట్రాన్స్‌ఫార్మర్‌ ఉన్న స్తంభానికే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల మీటర్‌ వద్ద ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉండదని విద్యుత్‌ ఇంజనీర్లు పేర్కోంటున్నారు. ఫ్రీపెయిడ్‌ మీటర్లు కాబట్టి వినియోగదారుడు సైతం మొబైల్‌ నుంచే ఎంత కరెంట్‌ వాడుతున్నారో చూసుకునే వీలుంటుంది. ఈ విధానం వల్ల ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి వెలుతున్న విద్యుత్‌ ఎంత.? అక్కడ 5మీటర్లలో నమోదవుతున్న కరెంట్‌ ఎంత అనే వివరాలను ఏ నెలకు ఆ నెల గమనించడానికి అవకాశం ఉంటుందని, దీనివల్ల ఎక్కడ విద్యుత్‌ పక్కదారి పడుతుందో గుర్తించడానికి సులువవుతుందని ఇంజనీర్లు సూచిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement