Thursday, November 21, 2024

ఒక్కటైన చైతన్యపురి బీఆర్ఎస్ నేతలు.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి జిన్నారం విఠల్ రెడ్డి సంఘీభావం..

హైదరాబాద్ తూర్పు ప్రతినిధి, సెప్టెంబర్ 20 (ప్రభ న్యూస్): గత కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉన్న చైతన్యపురి బీఆర్ఎస్ నేతలు ఒకటయ్యారు. చిన్నచిన్న విభేదాలతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని విభేదించి గత కొంతకాలం పార్టీకి అంటీ ముట్టనట్లుంటున్న మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి వర్గీయులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. విభేదాలు వీడి ఐక్యతతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని గెలిపించుకుంటామని ప్రకటించారు. బుధవారం పార్టీ నాయకులతో కలిసి విఠల్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం, మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డికి పూర్తి స్థాయిలో సహకరించి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ లైన్ దాటి ఎన్నడూ వ్యవహరించలేదని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి అందరం పని చేస్తామని విఠల్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేదన్నారు. రెండు మూడు రోజుల్లో చైతన్యపురి డివిజన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డితో కలిసి నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరిస్తామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కొనసాగాలంటే అందరూ ఆయనకు బాసటగా నిలవాలని విఠల్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్జల మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, జిట్టా రాజశేఖర్ రెడ్డి, జీవీ సాగర్ రెడ్డి, చెరుకు సంగీత, చెరుకు ప్రశాంత్ గౌడ్, చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట మహేష్ యాదవ్, కర్మన్ ఘాట్ ధాన్యాంజనేయ స్వామి దేవాలయ కమిటీ మాజీ అధ్యక్షుడు కోతి నర్సిరెడ్డి, చైతన్యపురి డివిజన్ నాయకులు గట్టు శ్రీనివాస్, పవన్ కుమార్, రమణారెడ్డి, వీరన్న యాదవ్, తిరుమల్ రెడ్డి, నరహరి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement