Tuesday, November 19, 2024

ప్రజల చైతన్యంతోనే కరోనా అంతం..కేంద్ర మంత్రి..

నల్లకుంట : ప్రజల చైతన్యంతోనే కరోనాని అంతమొందించ గలమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా నగరంలోని కోవిడ్‌ చికిత్స ఆస్పత్రులైన గాంధీ, కింగ్‌ కోటి, ఇఎస్‌ఐ,టిమ్స్‌ ఆస్పత్రులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను, ఆస్పత్రిలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌ ఐసియు వార్డులు, వ్యాక్సినేషన్‌ సెంటర్స్‌ను కూడా మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కరోనాపై పూర్తిగా అవగాహణ పెంచుకోవాలని, అప్పుడే దానిని తరిమికొట్టే పరిస్థితి ఉంటుందన్నారు. గాంధీ ఆస్పత్రిని పూర్తి కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చడంతో రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి రోగులు వస్తున్నారని, దీంతో అక్కడ తగినంతగా బెడ్స్‌, ఆక్సీజన్‌, రెమిడెసివర్‌ అందుభాటులో ఉంచాలని వైద్యులకు సూచించారు. అలాగే కేంద్రం నిధులతో గాలిలో నుంచే 2వేల లీటర్ల ఆక్సీజన్‌ నిమిషానికి తీసే పిఎస్‌ఎ యూనిట్‌ నిర్మాణాన్ని పరిశీలించి తొందరలోనే అందుభాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. వ్యాక్సిన్‌ కొరత తీరడానికి మూడు షిప్ట్‌లలో 24 గంటలు వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ఆయా కంపెనీలు చేస్తున్నాయని తెలిపారు. ఆక్సీజన్‌ కొరత లేకుండా కూడా 12 కంపెనీలు 360 మెట్రిక్‌ టన్నుల ఆక్సీజన్‌ను తెలంగాణకు పంపుతున్నాయని, సమీప రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి యుద్ధ విమానాలను ఉపయోగించి ఆక్సీజన్‌ తీసుకొస్తున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. టిమ్స్‌లో మరో 2 ఫ్లోర్స్‌లో ఐసియుతో సహా జనరల్‌ వార్డులను ఏర్పటుచేయవచ్చని అన్నారు. పిఎం కేర్‌ నిధితో టిమ్స్‌లో ఏర్పాటుచేసిన రెండు వందల వెంటి లేటర్స్‌, బెడ్స్‌లో వంద ఖాళీగానే ఉన్నాయని ఆయన వివరించారు. ఎన్‌ఆర్‌బిఎం ఆక్సీజన్‌ మాస్కుల కొరత లేకుండా చూడడంతో పాటు, టిమ్స్‌కు కేటాయించిన గాలి ద్వారా ఆక్సీజన్‌ తయారుచేసుకునే ఎక్విప్‌మెంట్‌ త్వరగా వచ్చేటట్లు చర్యలు తీసుకుంటామని అన్నారు. టిమ్స్‌లో ఆక్సీజన్‌ గాని రెమిడెసివర్‌ కొరతలేదని, తాను సందర్శించిన అన్ని ఆస్పత్రులలో బెడ్స్‌, ఆక్సీజన్‌ ఇతర సదుపాయాలు బాగున్నాయని అన్నారు. రెండు రోజుల్లో వ్యాక్సిన్‌ కొరత, ఆక్సీజన్‌ కొరత తీరుతుందన్నారు. సనత్‌నగర్‌ ఇఎస్‌ఐ ఆస్పత్రిలో కోవిడ్‌ సర్వీసెస్‌ ప్రిపేర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పాల్గొని అక్కడ ఉన్న వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను సందర్శించి రోగులతో వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించి, బౌతిక దూరం పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కష్ట సమయంలో ఆదుకోకుండా మోడిని విమర్శించడం తగదన్నారు. రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపదని పరిస్థితిని బట్టి సహాయం అందిస్తుందన్నారు. కేంద్రం ఆరోగ్య శాఖకు ఇచ్చిన నిధులు ఈ అత్యవసర సమయంలో ఖర్చు పెట్టుకోవాలని సూచించారు. మే, జూన్‌ నెలలో రెండు నెలలపాటు అదనంగా ఉచిత రేషన్‌ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని మంత్రి తెలిపారు. ఆస్పత్రులలో పరిస్థితులపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో త్వరలోనే మాట్లాడుతానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement