హైదరాబాద్, ఆంధ్రప్రభ: దేశంలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్య క్రమాలకు ఎన్టీఆర్ నాంది పలికారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సినీరంగంలో పురాణపురుషుడిగా, రాజకీయ రంగంలో పేదల పెన్నిధిగా బాధ్యతలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు తెలుగువారికి గుర్తింపు ఉండేది కాదని చెప్పారు. సంవత్సరంలోగా హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్ తెలుగుజాతి అభ్యున్నతికి, గుర్తింపు కోసం నిరంతరం శ్రమించారని చెప్పారు. పురాణ పురుషులు ఎలా ఉంటారంటే ఎన్టీఆర్ పాత్రలు చూస్తే తెలుస్తుందని చెప్పారు. సమస్యలు ఎక్కడన్నా వాటిని పరిష్కరించేందుకు కష్టపడేవారని తెలిపారు. ఆదివారం కూకట్‌పల్లి కైత్లాపూర్ మైదానంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు సినీపరిశ్రమ, రాజకీయ ప్రముఖులు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు శతజయంతి వేడుకలకు కదలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుప్రజల ఆకాంక్షగా మిగిలి పోయిన ఎన్టీఆర్‌కు భారత రత్న ఇచ్చేంతవరకు పోరాడుతుంటామని ఆయన చెప్పారు. భారతదేశానికి ఎన్టీఆర్ చేసిన సేవలకు గుర్తింపుగా భారత రత్న ఇవ్వాలని మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడుగా ఎన్టీఆర్ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పు డు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు భారత రత్న ఇచ్చేంతవరకు పోరాడా రని గుర్తు చేశారు. రాజమండ్రిలో నిర్వహించే మహానాడులో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ప్రజలంతా ఆహ్వానితులని చెప్పారు. మహానాడు కు ప్రజలంతా కదిలి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దివిసీమలో కరువు వస్తే జోలెపట్టి ప్రజలకు సహాయం చేశారని గుర్తుచేశారు. అమెరి కాలోని 50 నగరాల్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నా యని చెప్పారు. ఎన్టీఆర్ తెలుగువారి వారసత్వం అన్నారు. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతారని పేర్కొన్నారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, వంద సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ వెలిసిన ఎన్టీఆర్ వెలు గు మరో వేయి సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. సినీపరిశ్రమలోనే కాదు రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ హీరో పాత్ర పోషించారని చెప్పారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయాల్లో సాధించిన విజయాలను ఆయన గుర్తుచేశా రు. ప్రాంతాలు వేరైనా తెలుగు వారందరూ కలిసి అభివృద్ధి సాధించాలని అకాంక్షించారు.
నందమూరి బాలకృష్ణతోపాటుగా వసుంధర, దేవాన్ష్. నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, బ్రహ్మణి, కళ్యాణరామ్‌తో పాటుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యలు యావత్తు కదిలివచ్చారు. అయితే తానురాలేక పోతున్నాని ముందుగానే జూనియర్ ఎన్టీఆర్ సమాచారం ఇచ్చారు. అలాగే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీపీఎం జాతీ య కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, టీడీపీ నాయకుడు, శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితర రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అలాగే దివంగత సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, సినీ దిగ్గజాలు మురళీమోహన్, రామ్‌చరణ్, వెంకటేష్, అడవి శేషు, నాగ చైతన్య, ఆర్. నారాయణమూర్తి, అశ్వినీదత్, అల్లు అరవింద్, బోయపా టి శ్రీను, విజయేంద్రప్రసాద్, కన్నడ దర్శకుడు శివరాజ్ కుమార్, సిద్దు జొన్నలగడ్డ, దర్శకుడు రావిపూడి, హీరోయిన్స్ జయప్రద, జయసుధతో పాటుగా పలువురు సినీరంగ ప్రముఖులు పాల్గొన్నారు. మలయాల నటుడు మోహన్ లాల్ వీడియో సందేశంలో ఎన్టీఆర్‌ను ప్రశంసించారు. ఈ సందర్భంగా జయహో ఎన్టీఆర్, యుగపురుషుడు ఎన్టీఆర్ సావనీర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు.