Friday, November 22, 2024

ఎంపి మాలోత్ క‌విత ఇంటిలో సిబిఐ ట్రాప్ – ముగ్గురు అరెస్ట్..

న్యూఢిల్లీ/ హైద‌రాబాద్ : ఎంపీ సహాయకులమంటూ బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను సీబీఐ రెడ్‌-హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఢిల్లిలోని ఎంపీల అధికారిక నివాస సముదాయం సరస్వతి అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన చోటుచేసు కుంది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌ ప్రకారం ఢిల్లిలోని న్యూగుప్తా కాలనీకి చెందిన మన్‌మీత్‌ సింగ్‌ లాంబ ఢిల్లిలోని సర్దార్‌ నగర్‌లో కొత్తగా ఓ ఇంటిని నిర్మించుకుంటున్నారు. అయితే ఆ ఇల్లు అక్రమ నిర్మాణమని, దానిపై చాలా ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని, తమకు డబ్బులిచ్చి వ్యవహారం సెటిల్‌ చేసుకోవాలని చెబుతూ తొలుత రాజీవ్‌ భట్టాచార్య అనే వ్యక్తి మన్‌మీత్‌ సింగ్‌ లాంబకు ఫోన్‌ చేశాడు. టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్‌ కవితకు పర్సనల్‌ సెక్రటరీగా పనిచేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. విషయం సెటిల్‌ చేసుకోవాలని మాలోత్‌ కవితకు కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న శుభాంగి గుప్తను కలవాలని సూచించాడు. లేదంటే ఎంసీడీలోని మాలిక్‌ అనే అధికారి ద్వారా ఇంటిని కూల్చేస్తామని బెదిరించాడు. దీంతో బాధితుడు లాంబ, శుభాంగి గుప్తాకు ఫోన్‌ చేశాడు. తమకు రూ. 5 లక్షలు ఇస్తే, ఇంటిని కూల్చకుండా చూస్తామని, ముందుగా రూ. లక్ష తీసుకుని ఎంపీ కవిత అధికారిక నివాసం (401, సరస్వతి అపార్ట్‌మెంట్స్‌)కు రావాలని శుభాంగి బాధితుడితో చెప్పింది. మాటల్లో అక్కడ ఎంపీ కవిత, మరో పీఏ దుర్గేశ్‌ కుమార్‌ ఉంటారని, ముందుగా రూ. 1. లక్ష తీసుకురావాలని ఒత్తిడి చేసింది. దుర్గేశ్‌ కూడా లాంబకు ఫోన్‌ చేసి తొందరగా సెటిల్‌ చేసుకోవాలని బెదిరించడంతో, ఆయన సీబీఐని ఆశ్రయించి జరిగిన విషయం చెప్పారు. బాధితుడి సమాచారాన్ని ధ్రువీకరించుకునేందుకు డిజిటల్‌ రికార్డింగ్‌ పరికరాలను ఉపయోగించిన సీబీఐ, ఆ తర్వాత ఓ సాక్షిగా మరో ప్రభుత్వాధికారిని తమ వెంటపెట్టుకుని వలప న్నింది. లాంబతో పాటు ప్రభుత్వ అధికారిని ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగిగా తీసుకెళ్లాలని సూచించింది. ఆ మేరకు లాంబ సీక్రెట్‌ కెమెరా, ఇతర డిజిటల్‌ రికార్డింగ్‌ పరికరాలతో పాటు రూ. 1 లక్ష నగదుతో ప్రభుత్వోద్యోగి వెంటబెట్టుకుని సరస్వతి అపార్ట్‌మెంట్స్‌కు చేరుకున్నారు.
అక్కడ రాజీవ్‌ భట్టాచార్య, శుభాంగి గుప్త, దుర్గేశ్‌ కుమార్‌ ముగ్గురూ సిద్ధంగా ఉన్నారు. వారితో తన ఇంటి వ్యవహారం గురించి కాసేపు మాట్లాడి, సంభాషణ మొత్తం రికార్డు చేశారు. డబ్బులిస్తే ఏ ఫిర్యాదుపైనా చర్య లేకుండా చేస్తామని ఆ ముగ్గురూ నమ్మబలికారు. ఆ తర్వాత రూ. లక్ష తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డిజిటల్‌ వీడియో రికార్డులు, ప్రత్యక్ష సాక్షి ప్రభుత్వోద్యోగి వాంగ్మూలం, లాంబ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్‌ 120(బీ), 384 తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7(ఏ) ప్రకారం ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేశారు. అందులో రాజీవ్‌ భట్టాచార్య, శుభాంగి గుప్తాతో పాటు మరికొందరు ప్రభుత్వోద్యోగులను నిందితులుగా పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో ముగ్గురిలో దుర్గేశ్‌ కుమార్‌ మాత్రమే ఎంపీ మాలోత్‌ కవిత వద్ద కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, ఈ మధ్యనే పనిలో చేరాడని తెలిసింది. మాలోత్‌ కవితకు కేటాయించిన అధికారిక నివాసంలో స్టాఫ్‌ క్వార్టర్స్‌లో ఉంటున్నాడని గుర్తించారు. ఆ ఇంటిని వేదికగా చేసుకుని బెదిరింపులు, వసూళ్లకు పాల్పడుతున్నట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
ఆ ఇద్దరూ ఎవరో తెలియదు,
దుర్గేశ్‌ మాత్రమే తెలుసు: కవిత
సీబీఐ ట్రాప్‌ వ్యవహారంపై ఎంపీ మాలోత్‌ కవిత స్పందిస్తూ ఓ వీడియో క్లిప్‌ విడుదల చేశారు. సీబీఐ కేసులో దొరికిన ముగ్గురిలో ఒక్క దుర్గేశ్‌ మాత్రమే తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని ధ్రువీకరించారు. నిజానికి తాను ఢిల్లిdలో పీఏ, పీఎస్‌ అనే పోస్టుల్లో ఎవరినీ నియమించుకోలేదని తెలిపారు. న్యూస్‌ ఛానెళ్ల ద్వారానే తన సహాయకులమంటూ వసూళ్లకు పాల్పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. కొత్తగా నిర్మించిన సరస్వతి అపార్ట్‌మెంట్స్‌లో తనకు రెండు నెలల క్రితమే అధికారికంగా నివాసాన్ని కేటాయించారని, అందులో స్టాఫ్‌ క్వార్టర్సులో ఉండేందుకు డ్రైవర్‌ దుర్గేశ్‌కు అవకాశం కల్పించానని ఆమె వివరించారు. ఆ ముగ్గురిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకెలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement