Saturday, November 23, 2024

కేన్స‌ర్ రోగులకు కోవిడ్ సోకితే మరణాల శాతం ఎక్కువ : డా. అర్చ‌నా ప్ర‌త్తిపాటి

కేన్సర్ రోగులకు కోవిడ్ సోకితే మరణాల శాతం ఎక్కువ ఉంటుందని బాచుప‌ల్లి ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ రేడియేష‌న్ ఆంకాల‌జిస్టు డాక్ట‌ర్ అర్చ‌నా ప్ర‌త్తిపాటి అన్నారు. ఆమె మాట్లాడుతూ… కేన్స‌ర్, కోవిడ్ -19 అత్యంత బాధాక‌ర‌మైన రోగాల‌ని మ‌న దేశంలో 4 కోట్ల‌మందికి పైగా అత్యంత పెద్ద మ‌హమ్మారి కొవిడ్-19 బారిన‌ ప‌డ్డారన్నారు. కేన్స‌ర్ రోగుల‌కు కొవిడ్ సోకితే సాధార‌ణ ప్ర‌జ‌ల కంటే 3 రెట్లు ఎక్కువ ఇన్ఫెక్టివిటీ రేటు, 5శాతం ఎక్కువ మ‌ర‌ణాల శాతం ఉంటున్నాయన్నారు. మ‌హ‌మ్మారి వ‌చ్చిన తొలినాళ్ల‌లో అంత అత్య‌వ‌స‌రం కాని చికిత్స‌ల‌న్నింటినీ ఆస్ప‌త్రులు ఆపేశాయన్నారు. వాటిలో కేన్స‌ర్ చికిత్స కూడా ఒక‌టి. త‌ర్వాతి కాలంలో దాని గురించి తెలిసిన త‌ర్వాత కేన్స‌ర్ చికిత్స మొద‌లైందన్నారు. కేన్స‌ర్ చికిత్స‌ల‌లో ఇమ్యునోస‌ప్రెసెంట్లు వాడ‌తారు కాబ‌ట్టి ఈ రోగుల‌కు ఇన్ఫెక్ష‌న్లు సోకే అవ‌కాశం ఎక్కువ అన్నారు. ఎప్పటిక‌ప్పుడు కొత్త మ్యుటేష‌న్లు, స్ట్రెయిన్లు రావ‌డం, మ‌ళ్లీ మ‌ళ్లీ కూడా కొవిడ్ సోకుతుండ‌టంతో కేన్స‌ర్ రోగుల్లో కొవిడ్ ఇన్ఫెక్ష‌న్‌పై పోరాడేందుకు మ‌నం సిద్దంగా ఉండాలన్నారు.

ఆనెల 4న‌ ప్రపంచ కేన్స‌ర్ దినం సంద‌ర్భంగా ఈసారి థీమ్ క్లోజ్ ద కేర్ గ్యాప్ అన్నారు. కొవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా చికిత్స‌ను వాయిదా వేయ‌కూడద‌న్న విష‌యంలో ఇది స‌రిగ్గా స‌రిపోతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్ర‌తి ప‌దిమందిలో ఒక‌రికి వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ల వ‌ల్ల కేన్స‌ర్ రావ‌చ్చ‌ని ఎన్‌సీఐ చెబుతోందన్నారు. 12 వారాలు దాటి కొవిడ్ ల‌క్ష‌ణం ఏమున్నా దాన్ని దీర్ఘ‌కాల కొవిడ్‌గా భావించాలన్నారు. ఇది కోలుకున్న వారిలో 10-15శాతం మందికి ఉందన్నారు. కెమో, రేడియోథెర‌పీ తీసుకునే కేన్స‌ర్ రోగుల‌కు ఇన్ఫెక్ష‌న్లు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువన్నారు. వారు సాధార‌ణ ప్ర‌జ‌ల కంటే 4శాతం ఎక్కువ మ‌ర‌ణిస్తార‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ చెబుతోందన్నారు. శ్వాస‌కోశ వైర‌స్‌లు కేన్స‌ర్ రోగుల‌కు మ‌రింత ప్ర‌మాద‌క‌రమ‌న్నారు. ఈ రెండు వ్యాధుల వ‌ల్ల సైటోకైన్ స్టార్మ్ వ‌స్తుందన్నారు. ఈ రెండింటిపైనా ప‌నిచేసే మందుల‌ను క‌నుక్కొనేందుకు ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయన్నారు. కేన్స‌ర్ చికిత్స‌లో వాడే టోసిలిజుమాబ్ వ‌ల్ల సైటోకైన్ స్టార్మ్ కూడా త‌గ్గుతుందన్నారు. మాస్కులు ధ‌రించ‌డం, చేతుల శానిటైజేష‌న్, టీకా తీసుకోవ‌డం వ‌ల్ల కేన్స‌ర్ రోగుల‌కు కొవిడ్ వ‌చ్చే ముప్పు త‌గ్గుతుందన్నారు. ఈ రెండింటిపైనా ప‌నిచేసే మందుల‌పై ప‌రిశోధ‌న‌లు చేస్తే దీర్ఘ‌కాలంలో ఉప‌యోగం ఉంటుందని, మ‌రో వేవ్ వ‌స్తే ఏం చేయాల‌న్న‌దానిపై సిబ్బందికి శిక్ష‌ణ‌, ఆస్ప‌త్రుల‌ను మెరుగుప‌ర్చుకుంటే మ‌రింత మంచిదని డా.అర్చ‌నా ప్ర‌త్తిపాటి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement