Friday, November 22, 2024

Budget Comments – ఇది తిరోగ‌మ‌న బ‌డ్జెట్ … హ‌రీశ్ రావు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ ప్ర‌తినిధి – ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. బడ్జెట్‌లో అంకెల గారడీ గా ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క బ‌డ్జెట్ ఉందంటూ ఎద్దేవా చేశారు బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత‌,మాజీ మంత్రి హ‌రీశ్ రావు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఆసరా పెన్షన్‌ల ప్రస్తావన తేకుండా వితంతువులు, వృద్ధులు, వికలాంగులను ప్రభుత్వం నిరాశపర్చిందని విమర్శించారు. కాంగ్రెస్‌ సర్కారుకు పేదల ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత లేదని అన్నారు.

ఇది రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపే బడ్జెట్ అని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని గొప్పలకు పోయిన కాంగ్రెస్ సర్కారు.. బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే తేకపోవడం దారుణమని అన్నారు. ఆర్భాటంగా అభయ హస్తం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆరు గ్యారెంటీ ఊసెత్తలేదని మండిపడ్డారు.

- Advertisement -

ఆసరా పింఛన్‌లు పెంచుతామని ఎన్నికల్లో హామీలు ఇచ్చారని, వృద్ధుల పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు, వికలాంగుల పెన్షన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని.. బడ్జెట్‌లో ఆ ప్రస్తావన ఎందుకు చేయలేదని హరీష్‌రావు ప్రశ్నించారు. ఇచ్చిన మాట తప్పడం ద్వారా ప్రభుత్వం పేదలను మోసం చేసిందని విమర్శించారు.

ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఓట్లు దండుకున్న సర్కారు.. ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడలేదని, మాయమాటలతో విద్యార్థులను మోసం చేసిందని హరీష్‌రావు మండిపడ్డారు. ఆటో కార్మికులకు రూ.12 వేలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పారని, ఇప్పుడు ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఖరి కారణంగా ఇప్పటికే 50 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని హరీష్‌రావు గుర్తుచేశారు.

సూప‌ర్ స్టార్ కు క‌నిపించిన అభివృద్ధి ఈ ఘ‌జ‌నీ స్టార్ ల‌కు క‌నిపించదు

మేనిఫెస్టోను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలి కానీ దురదృష్టవశాత్తూ అలా లేదని అన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన నెలకు రూ.2500 సాయం కోసం కోటి మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయినప్పటికీ మహిళలకు ఆర్థిక సహయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. . బడ్జెట్‌లో విద్యా భరోసా కార్డు అంశాన్ని ప్రభుత్వం మర్చిపోయిందన్నారు.

కొత్త రేషన్ కార్డు ఎప్పటీ నుండి ఇస్తారో చెప్పలేదు. జ్యాబ్ క్యాలెండర్ ప్రస్థావన లేదని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని తాము నిర్లక్ష్యం చేశామని భ‌ట్టి పేర్కొనడం ప‌ట్ల హ‌రీశ్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని బీఆర్ఎస్ కొనసాగించిందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్‌ను సూపర్ స్టార్ రజనీ కాంత్ పొగిడారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి రజనీకి కనిపించింది కానీ కాంగ్రెస్ గజినీలకు కనిపించలేదు అని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన కారణంగానే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement