Tuesday, November 26, 2024

ప్రకృతిని ఆరాధించే పండుగే బతుకమ్మ.. మంత్రి త‌ల‌సాని

ప్రకృతిని ఆరాధించే పండుగే బతుకమ్మ పండుగ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్ పేటలోని మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ లో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈనెల 26 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు నిర్వహించే బతుకమ్మ పండుగ మహిళల పండుగ అని, పేద, మద్య తరగతి మహిళలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 2017 సంవత్సరం నుండి తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా కోటి 18 లక్షల చీరలను పంపిణీ చేస్తున్నట్లు, ఇందుకోసం 340 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ౩౦ రకాల డిజైన్ లు, వివిధ రంగులతో రాష్ట్రంలోని చేనేతలు తయారు చేసిన చీరలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దీంతో చేనేతలకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 52, 261 మందికి చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ పల్లెల్లో పుట్టి రాష్ట్రానికే పరిమితమైన‌ బతుకమ్మ పండుగ నేడు విశ్వవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణమ‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ ఇలా అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు హేమలత, మహేశ్వరి, పద్మారావు నగర్ TRS ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ లు ఆకుల రూప, అత్తిలి అరుణ గౌడ్, ఉప్పల తరుణి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, DC ముకుంద రెడ్డి, UCD PD నీరజ, తదితరులు పాల్గొన్నారు.


సనత్ నగర్ లో….
పేద, మద్య తరగతి ప్రజలు కూడా పండుగలను సంతోషంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచన అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2017 సంవత్సరం నుండి ప్రారంభించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రంలోని చేనేత కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. 340 కోట్ల రూపాయల వ్యయంతో 17 రంగులు, ౩౦ డిజైన్ల‌తో తయారు చేసిన కోటి 18 లక్షల చీరలను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 9 రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ పండుగ తెలంగాణ పల్లెల్లో ప్రారంభమై నేడు లండన్, అమెరికా, దుబాయ్ తదితర దేశాల్లో నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. గతంలో ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడేందుకు అనుమతించే వారు కాదని, స్వయం పాలన వచ్చిన తర్వాత ట్యాంక్ బండ్ పై ఘనంగా బతుకమ్మను నిర్వహించే విధంగా ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కోలన్ లక్ష్మి, సరళ, జోనల్ కమిషనర్ రవి కిరణ్, DC మోహన్ రెడ్డి, UCD PD దామోదర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement