హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో గురువారం గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. సంస్థ ఎండీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ తో కలిసి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారిని స్మరించుకున్నారు. అనంతరం టీఎస్‌ఆర్టీసీని ఆదరిస్తోన్న ప్రజలకు, సంస్థ అభివృద్దికి నిరంతరం పాటుపడుతున్న సిబ్బందికి, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, ప్రతి పౌరుడు దేశ పురోభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ నేతృత్వంలో అనేక వ్యూహాత్మక కార్యక్రమాల వల్ల టీఎస్‌ఆర్టీసీలో గుణాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఇది మంచి పరిణామమని చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. సంస్థ అన్ని విభాగాల్లో అసాధారణ వృద్ధిని నమోదు చేసుకుందని చెప్పడానికి సంతోషంగా ఉందన్నారు. సంక్రాంతికి 11 రోజుల్లోనే 2.82 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని గుర్తు చేశారు. సిబ్బంది చిత్తశుద్ధి, నిబద్దతతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
సమిష్టి కృషితో గత ఏడాది దాదాపు రూ.1338 కోట్ల మేర నష్టాన్ని తగ్గించగలిగామన్నారు. వ్యూహరచనతో ముందుకు వెళ్లడం వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయని వివరించారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ పెద్ద పీట వేస్తోందని, గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ద్వారా 300మంది ప్రాణాలను కాపాడగలగడమనేది గొప్ప విషయమన్నారు. టీఎస్‌ఆర్టీసీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదర్కొంటున్నప్పటికీ.. ఉద్యోగులకు 5 డీఏలను చెల్లించామని గుర్తు చేశారు. డీఏల ద్వారా రూ.4వేల నుంచి 5 వేల వరకు సిబ్బంది జీతాలు పెరిగాయని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని గుర్తుచేశారు. 4170 బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పర్యాటకుల కోసం హైదరాబాద్ దర్శన్, బొగ్గు గనులను సందర్శించేందుకు సింగరేణి దర్శన్ పేరుతో ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.
త్వరలోనే కాళేశ్వరం సందర్శనకు ఒక ప్యాకేజీని తీసుకురాబోతున్నామని తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన తాగునీటిని అందించేందుకు జీవా వాటర్ బాటిళ్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చామని గుర్తుచేశారు. కొత్తగా 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో 1000కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. భవిష్యత్‌లో సంస్థ మరెంతో అభ్యున్నతి సాధించ కలుగుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. రాబోయే శివరాత్రి, శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్‌ను వినియోగించుకోవాలని అధికారులకు బాజిరెడ్డి గోవర్దన్ సూచించారు. ఈ గణతంత్ర వేడుకల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లు పీవీ మునిశేఖర్, వినోద్ కుమార్, మెడికల్ అడ్వైజర్ సైది రెడ్డి, సీఎఫ్‌ఏ విజయ పుష్ఫ, తదితరులు పాల్గొన్నారు.