Saturday, November 23, 2024

ఆజాదీ కా రైల్‌ గాడీ ఔర్‌ స్టేషన్ ఉత్సవాలను ప్రారంభించిన దక్షిణమధ్య రైల్వే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా నిర్వహిస్తోన్న అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా ఇండియన్‌ రైల్వే ఆజాదీ కా రైల్‌ గాడీ ఔర్‌ స్టేషన్‌ ఉత్సవాలను ప్రారంభించింది. సోమవారం కేంద్రస్థాయిలో రైల్వే బోర్డు ఛైర్మన్‌, సీఈవో వినయ్‌ కుమార్‌ తిప్రాఠి, హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉత్సవాలను దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జ్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఉత్సవాల్లో సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఏ. కె.గుప్తా, ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఈనెల 18 నుంచి 23 వరకు ఇండియన్‌ రైల్వే నిర్వహించనుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, గద్వాల్‌ స్టేషన్లలో ఈ చారిత్రాత్మక సంబరాలను నిర్వహిస్తున్నారు. ఇండియన్‌ రైల్వేలు కూడా స్వాతంత్య్ర పోరాటంలో మమేకమైన సంగతి తెలిసిందే.

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులను ఒక చోట నుంచి మరో చోటికి చేర్చడంలో ఇండియన్‌ రైల్వే విశేష సేవలను అందజేసింది. అజాదీ కా మహోత్సవ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 75 రైల్వే స్టేషన్లు, స్వాతంత్య్ర పోరాటంతో సంబంధమున్న 27 రైళ్లలో గాడీ ఔర్‌ స్టేషన్‌ ఉత్సవాలను నిర్వహిస్తునారు. దక్షిణ మధ్య రైల్వేలో స్వాతంత్య్ర సమరం, వారసత్వాన్ని గౌరవించడానికి హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, గద్వాల్‌తో పాటు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను ఎంపిక చేశారు. స్వాతంత్య్ర ఉద్యమం జరిగిన రోజుల్లో 1929 నుంచి 1934 మధ్య కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ పలుమార్లు హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌కు రావడం ఒక ప్రత్యేకతగా నిలిచిందని ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జ్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement