Saturday, November 23, 2024

TS | దడ పుట్టిస్తున్న దారుణ హత్యలు.. మిస్సింగ్‌ కేసులపై పోలీసుల ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : నగరం, నగర శివారులో దారుణ హత్యలు, అనుమానస్పద మృత దేహాలు, గుర్తు తెలియని శవాల కేసులు దడ పుట్టిస్తున్నాయి. గడచిన నాలుగు రోజుల్లో నలుగురు దారుణ హత్యకు గురి కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో కొన్ని కేసులలో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేయగా మిగలిన కేసులపై విచారణ సాగిస్తున్నారు. నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వాచ్‌ మెన్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం జంగయ్య అనే వ్యక్తి మంచిరేవులలో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌ లో వాచ్‌ మెన్‌ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుగొల్పే విషయాలు బయటకి వచ్చాయి. బీహార్‌కు చెందిన తాపీ మేస్త్రీ అర్జున్‌ బిల్డింగ్‌లో ఉన్న స్క్రాప్‌ మెటీరియల్‌ను అమ్మి సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం వాచ్‌మెన్‌ జంగయ్య యజమానికి తెలియజేశాడు.

దీంతో కోపం పెంచుకున్న అర్జున్‌ వాచ్‌మెన్‌ జంగయ్యను దారుణంగా హత్య చేశాడు. పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిచడంతో నిజాలు వెలుగుచూశాయి. స్క్రాప్‌ అమ్మిన విషయం బిల్డింగ్‌ యజమానికి చెప్పినందుకే జంగయ్యను చంపేశానని నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. దీంతో నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

వరుస ఘటనలపై దర్యాప్తు :

- Advertisement -

దుండిగల్‌ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందటం, మృతుని ఒంటిపై గాయాలు ఉండటంతో ఏదైనా వాహనం ఢీ కొట్టిందా లేక ఎవరైనా కొట్టి చంపారా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పచ్చి చికెన్‌ తిన్న విషయంలో గొడవపడి ఆపై దాడి చేసి ఓ యువకుడిని కత్తితో పొడిచాడు. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తుకారాంగేట్‌ పోలీసులు విచారణ చేపడుతున్నారు. అలాగే భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త కత్తితో భార్య మెడ కోసి వెంటనే అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

అలాగే సంక్రాంతి పండుగ రోజు వికారాబాద్‌ శివారులో ఒక మహిళను దుండగులు దారుణంగా హత్య చేసారు. అయితే మహిళను అత్యాచారం చేసే హత్య చేశారా? లేదా ఎక్కడో చంపి ఇక్కడ పడేసారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వికారాబాద్‌ ఘటనలోను అనుమానాస్పద యువతి మృతిపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్‌ పరిసర పోలీస్‌ స్టేషన్లో నమోదైన మిస్సింగ్‌ కేసుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

రెండు రోజుల క్రితం నమోదైన మిస్సింగ్‌ కేసుల వివరాలను అక్కడ లభించిన యువతి మృతి దేహంతో పోల్చి చూస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులకు ఈ కేసులో ఎలాంటి క్లూ లభించలేదు. పరిసరాలలో లభించిన సీసీటీ-వీ కేమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండు రోజులుగా ఎవరైనా యువతి ఇంటికి చేరుకోలేదనే ఫిర్యాదు ఉంటే వెంటనే తమను ఆశ్రయించాలని పోలీసులు చెబుతున్నారు. కాగా మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో యువతి ఆత్మహత్య కేసులోనూ మూడు రోజుల వరకు కనీసం ఒక్క క్లూ కూడా లభించని కేసులో చివరికి అది ఒక ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించారు.

గోనే సంచిలో మృతదేహం :

ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోబ్రాహ్మణపల్లి ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో ఒక గోన సంచి నుండి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గోనె సంచిని తెరిచి చూడగా అందులో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఒక పురుషుడి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే నగర శివారు ప్రాంతం కావడంతోనే ఎక్కడో చంపేసి గోనె సంచిలో మృతదేహాన్ని పెట్టి ఇక్కడ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై నుంచి కిందికి పడేసినట్టు-గా పోలీసులు అనుమానిస్తున్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నమోదైన పలు మిస్సింగ్‌ కేసుల వివరాలను పోలీసులు వెరిఫై చేస్తున్నారు. దీంతోపాటు- ఔటర్‌ రింగ్‌ రోడ్డు పైన ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement