హైదరాబాద్ : రాయల కార్పొరేన్స్ వజ్రోత్సవాల సందర్భంగా వ్యాపార ప్రపంచంలో సాగించిన విశేష ప్రయాణ అనుభవాలని లోతైన దృష్టితో ఆకట్టుకునేలా రాసిన పుస్తకాన్ని రాయల కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్ ప్రతాప్ ఆవిష్కరించారు. యాజ్ ది వీల్ టర్న్స్ పేరిట వెలువరించిన ఈ పుస్తకం రంజిత్ ప్రతాప్ వ్యక్తిగత అనుభవాలు, కష్టాలు, విజయాల గురించి చదువరులకు ప్రేరణ ఇచ్చేలా ఆసక్తికర కథనంగా సాగుతుంది. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాయల కార్పొరేషన్ కు చెందిన అధికారులు, స్నేహితులు, పదవీ విరమణ చేసిన అధికారుల సమక్షంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… రాయల కార్పొరేషన్ 75వ సంవత్సర వేడుకల్లో భాగంగా ఇక్కడకు రావడంతో పాటు రంజిత్ ప్రతాప్ పుస్తకాన్ని ఆవిష్కరించడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నానన్నారు. వ్యాపారవేత్తల విజయాల గురించి ఈ పుస్తకాన్ని విడుదల చేయడం చాలా ముఖ్యమని తాను భావిస్తున్నానన్నారు. ఎందుకంటే వారి జీవిత కథలు, వారి విజయాలు, వ్యాపారం, సమాజానికి వారందించిన తోడ్పాటు ప్రస్తుత, భావి తరాలు తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఎదగడానికి ఎల్లప్పుడూ చాలా ఉపయోగకరంగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
రాయల కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్ ప్రతాప్ మాట్లాడుతూ… తమ కార్పొరేట్ చరిత్రలో ఈరోజు నిజంగా ప్రత్యేకమైన రోజన్నారు. తమ వజ్రోత్సవం, ఈ కార్యకలాపాలకి తాను సారథ్యం వహిస్తూ 50 ఏళ్ళయ్యాయని, అలాగే తన పుస్తకం ఆవిష్కరణ రోజు కూడా అన్నారు. ఆటోమొబైల్ అసెంబ్లింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ వరకూ సాగినదే రాయల కథ అన్నారు. రాయల గ్రూప్ ఏ వ్యాపారంలోకి అడుగుపెట్టినా అందులో విజయం సాధించిందని తాను గర్వంగా చెప్పగలనన్నారు. వేర్వేరు కాలాల్లో వేర్వేరు సాంకేతికతలకు తాము అనుగుణంగా మారడం, కొత్త సాంకేతికతలని అందిపుచ్చుకుని, అణుగుణ్యంగా మారి, ప్రగతి సాధించడంలో తమ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు.