హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఫార్ములా-ఈ రేసులకు హైదరాబాద్ నగరం ముస్తాబవనుంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం ప్రారంభించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్ నగరంలోని హుస్సేస్ సాగర్ ఒడ్డున జరగనున్న ఏబీబీ, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ( ఎఫ్‌ఐఏ) ఫార్ములా- ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ రేసులకు సంబంధించి మేనేజ్‌మెంట్ కమిటీతో పాటు నిర్వహణ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేనేజింగ్ కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ వ్యవహరించనుండగా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మహీంద్రా రేసింగ్ సీఈవో దిల్‌బాగ్ గిల్, ఎఫ్‌ఐఏ ప్రతినిధులు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ తదితరులు సభ్యులుగా ఉండనున్నారు. ఇక రేసుల నిర్వహణ కమిటీలో పురపాలక శాఖ కార్యదర్శితో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, గ్రీన్ కో గ్రూపు సీఈవో, టీఎస్‌ఎస్పీడీసీఎల్ ఎండీ, ఖైరతాబాద్ జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీ, హెచ్‌ఎండీఏ సీఈ తదితర అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. సింగిల్ సీటర్ విద్యుత్‌తో నడిచే రేసు కార్లతో నిర్వహించే ఫార్ములా ఈ రేసులకు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్(ఎఫ్‌ఐఏ) 2014లో వరల్డ్ ఛాంపియన్ షిప్ హోదా ఇచ్చింది. ఫార్ములా ఈనే ఈ-ప్రిక్స్ పేరుతోనూ వ్యవహరిస్తారు. 2011-13 మధ్య ఢిల్లిలో నోయిడా శివార్లలో జరిగిన ఫార్ములా వన్ రేసుల తర్వాత దేశంలో జరుగుతున్న ఆ స్థాయి రేసులు హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా-ఈ రేసులే కావడం విశేషం.
హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం…
ఫార్ములా ఈ రేసుల కోసం హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ చుట్టూ ఒక ప్రత్యేక రేస్ ట్రాక్‌ను నిర్మించనున్నారు. సెక్రటేరియట్ భవనంతో పాటు లుంబిని పార్క్ గుండా ఈ ట్రాక్ వెళ్లనుంది. ఈ ట్రాక్ నిర్మాణం కోసం ఏస్ అర్బన్ రేస్ అనేసంస్థతో ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఫార్ములా ఈ రేసుల నిర్వహణకు సంబంధించి పలు శాఖల మధ్య సమన్వయం కోసం మేనేజింగ్ కమిటీ, నిర్వహణ కమిటీలను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రేసుల కోసం వచ్చే ప్రతినిధుల వసతులు, రవాణా రేసుల పబ్లిసిటీ, క్యాంపెయిన్, మీడియా తదితరాలను మేనేజింగ్ కమిటీ పర్యవేక్షించనుండగా రేసులకు అవసరమైన నిర్మాణాలను చేపట్టడంతో పాటు మౌళిక వతసుల ఏర్పాటును నిర్వహణ కమిటీ కి అప్పగించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.