ప్రైవేట్ జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ(అఫిలియేషన్)ను ఇంటర్ బోర్డు చేపట్టింది. 2022-23 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని కాలేజీలకు గుర్తింపును పొడిగించడంతో పాటు కాలేజీల్లో అదనపు సెక్షన్ల అనుమతికి మంగళవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇప్పటికే నిర్వహిస్తున్న కళాశాల యాజమాన్యాల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆ్వహానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 23 నుంచి ఎంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్ధేశిత ఫీజులను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలని కోరారు. కాలేజీలను మరో ప్రాంతానికి తరలించడం, కో-ఎడ్యుకేషన్, సొసైటీ, కళాశాల పేర్ల మార్పునకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. షిఫ్టింగ్ కాలేజీలు అదే మండల పరిధిలో లేనట్టయితే ఆ దరఖాస్తులను తిరస్కరణకు గురవుతాయని వెల్లడించారు. ఈ ఏడాది విద్యాసంవత్సరానికి ముందే గుర్తింపు ప్రక్రియను ముగించేయాలని, కాలేజీల జాబితాను ప్రకటించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.
ఈక్రమంలోనే ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 5వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించగా, రూ.20వేల ఫైన్‌తో మే 5వరకు గడువునిచ్చారు. మే 31 తేదీకల్లా ఈ ప్రక్రియను పూర్తి చేసి కాలేజీల జాబితాను ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది కరోనా కారణంగా ప్రైవేట్ కాలేజీలకు అనుంబంధ గుర్తింపు విషయంలో కొన్ని సడలింపులిచ్చిన ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి మాత్రం నిబంధనలను కఠినతరం చేసింది. నిబంధనల ప్రకారం కాలేజీలు నడుచుకోవాలని ఆదేశించింది. దరఖాస్తుల్లో బిల్డింగ్ ఓనర్‌షిప్, కాలేజీ లీజ్ డీడ్, అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్, ఫైర్ ఎన్‌ఓసీ, ఎఫ్డీఆర్ తదితర ధ్రువపత్రాలను తప్పనిసరిగా పొందుపర్చాలని బోర్డు స్పష్టం చేసింది. గతంలో ఇందులో మినహాయింపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే గత విద్యా సంవత్సరంలో చాలా కాలేజీలు గుర్తింపు పొందకుండానే అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..