కరోనా సంక్షోభం రాష్ట్రంలో పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం మే 12 నుంచి లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కష్టకాలంలో చాలామంది పేదలు హైదరాబాద్‌లో పస్తులుండే పరిస్థితులు వస్తున్నాయి. వీరి గురించి ఆలోచించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగర వ్యాప్తంగా మరిన్ని అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించనున్నట్టు తెలిపింది.
ప్రస్తుతం నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 140 అన్నపూర్ణ క్యాంటీన్లు రూ.5కే భోజనం అందిస్తున్నాయి. ఇప్పుడు అదనంగా 102 క్యాంటీన్లను మే 14 నుంచి ఏర్పాటు చేయనున్నారు. వీటిని ఎక్కడెక్కడ ప్రారంభించాలనే లిస్టును మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ పథకం హరేకృష్ణ ఛారిటబుల్ ట్రస్టు, జీహెచ్ఎంసీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదలకు చాలా ఉపయోగపడుతోంది.