35 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సున్న మహిళలు అండం ఫ్రీజింగ్ చేయించుకునేందుకు అనువైన వయస్సు అని బంజారాహిల్స్ అపోలో ఫెర్టిలిటీ, సీనియర్ కన్సల్టెంట్ ఇన్‌ఫెర్టిలిటీ అండ్ ఎఆర్‌టిస్పెషలిస్ట్ డా.సునీత ఇలినాని తెలిపారు. ఆమె మాట్లాడుతూ… మహిళలు పెద్దవారయ్యేకొద్ది సంతానోత్పత్తి సామర్ద్యం తగ్గిపోతుందన్నారు. వయస్సుతో పాటు మహిళల్లో అండాల సంఖ్య, అండాల నాణ్యత తగ్గుతూ ఉంటుందన్నారు. శిశువుగా జన్మించడంతోనే నిర్ణీత సంఖ్య కలిగిన అండాలతో పుడతారు, పుట్టినప్పుడు వారిలో దాదాపు 1-2 మిలియన్ అండాలుంటాయన్నారు. కాలక్రమేణా, ఈ అండాలు క్షీణిస్తూ వస్తాయన్నారు. ఒకఅమ్మాయి యుక్త వయస్సు వచ్చే సమయానికి కేవలం 300 – 4,00,000 వరకు మాత్రమే అండాలు మిగిలిఉంటాయన్నారు. ఆమె పెద్దయ్యాక ముఖ్యంగా 30 సంవత్సరాల వయస్సు తరువాత ఆమె ఈ అండాలను వేగంగా కోల్పోవడం జరుగుతుందన్నారు. అలాగే, కొంత మంది మహిళలు తమ సహచర మహిళల కంటే వేగంగా అండాలను కోల్పోతారన్నారు. తద్వారా వారిలో సహజంగా గర్భం దాల్చే అవకాశం సన్నగిల్లి పోతుందన్నారు.
30 ఏళ్లలోపు గర్భందాల్చడం సులభమే అయినప్పటికీ, సామాజిక, వృత్తిపరమైన లేదా అనారోగ్య కారణాల వలన ప్రస్తుత కాలంలో మహిళలు తమకు సరైన సమయం వచ్చేవరకు బిడ్డను కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారన్నారు. ఇటువంటి మహిళలు తమ అండాలను ఫ్రీజింగ్ చేయడం ద్వారా భవిష్యత్తులో వాటిని ఉపయోగించుకొనడం ద్వారా వారి సంతానోత్పత్తి అవకాశాలను కాపాడుకోవచ్చన్నారు. చికిత్స ప్రక్రియ ఐవీఎఫ్ చికిత్స మాదిరిగానే ఉంటుందన్నారు. ఇందులో 10 – 12 రోజుల వరకు రోజువారీ ఇంజెక్షన్లను తీసుకోవలసి ఉంటుందన్నారు. అండం పెరుగుదల అల్ట్రాసౌండ్, రక్తపరీక్షల ద్వారా పర్యవేక్షించబడుతుందన్నారు. అండాలు సిద్ధమైన తర్వాత, అనస్థీషియా ఇచ్చి ఆ తరువాత అల్ట్రాసౌండ్ సహాయంతో వాటిని ట్రాన్స్‌వాజినల్‌గా సేకరిస్తారు. ఈ ప్రక్రియకు సాధారణంగా 30-40 నిమిషాల సమయం పడుతుందన్నారు. దీనిని డేకేర్ ప్రక్రియగా అనగా ఒకేరోజు పూర్తయ్యేలా చేస్తారన్నారు. సేకరించిన ఈ అండాలను శిక్షణ పొందిన ఎంబ్రియాలజిస్ట్ అధ్యయనం చేసి తదుపరి ఉపయోగం కోసం వాటిని శీతలీకరణ చేస్తారన్నారు.
అండాలను ఫ్రీజింగ్ చేయడం అనేది భవిష్యత్తులో ఆ మహిళ శిశువుకు జన్మిస్తుందని హామీ ఇవ్వడం జరగదని, ఇక్కడ అర్థం చేసుకోవడం ముఖ్యమన్నారు. ఒక మహిళ గర్భం ధరించడానికి సిద్ధంగా ఉన్నా వెంటనే ప్రయత్నించడం ప్రారంభించాలన్నారు. అండాన్ని ఫ్రీజింగ్ ఎంపికకు పరిగణనలోకి తీసుకోవాలనే మహిళలు వివరణాత్మక అంచనా కోసం ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించాలన్నారు. ఫెర్టిలిటీ నిపుణుడు రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ చేయడం ద్వారా అండం ఫ్రీజింగ్ అయ్యే అవకాశాన్ని అంచనా వేస్తారని, వాటిని వేదికల ఆధారంగా మరింత మార్గనిర్దేశం చేయగలరని డా.సునీత ఇలినాని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital