Monday, September 16, 2024

TG TDP | తెలంగాణలో అన్ని టీడీపీ కమిటీలు రద్దు….

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తులు మొదలుపెట్టారు. ఈరోజు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని నిర్ణయించుకున్న ఆయన… తెలంగాణ రాష్ట్రంలోని పార్టీ జిల్లా, మండల కమిటీలు అన్నింటినీ రద్దు చేశారు.

తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా కీలక వ్యక్తికి బాధ్యతలు అప్పగించి కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఏపీ, తెలంగాణల్లో ఒకేసారి కొత్త కమిటీలు వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక‌ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో ఎవరైతే ఎక్కువ సభ్యత్వాలు చేస్తారో వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివని.. రెండు ప్రాంతాలను సమాన అభివృద్ధి చేయాలనేదే తన అభిమతమని చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు ఇక నుంచి ప్రతి నెలా రెండు రోజులు రాష్ట్రానికి వస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తెలుగుదేశం శ్రేణులను గుర్తు చేస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని… భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని చంద్రబాబు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement