Friday, November 22, 2024

శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు అన్ని ఏర్పాట్లు : మంత్రి త‌ల‌సాని

ఈనెల 17వ తేదీన జరిగే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద మహంకాళి అమ్మవారి జాతర (బోనాల ఉత్సవాల) పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. బోనాల ఉత్సవాలకు సంబంధించి పోస్టర్లు, బ్యానర్ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా నిర్వహించుకోలేదని, ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

మన సంస్కృతి, సాంప్రదాయాలు ఖండాంతరాలు దాటాయని, బోనాల ఉత్సవాలను అనేక దేశాల్లో జరుపుకుంటున్నారని, ఇది సంతోషదాయకమన్నారు. మహంకాళి ఉత్సవాలకు లక్షలాది మంది వచ్చే అవకాశమున్నందున భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మహిళలు, బోనాలు తీసుకొచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 18వ తేదీన నిర్వహించే ఏనుగు పై అమ్మవారి ఊరేగింపు సందర్భంగా ఏనుగు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. గతంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఖర్చు చేసేవారని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను విడుదల చేసిందని చెప్పారు. సుమారు 3500 దేవాలయాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలకు ముందే ఆర్ధిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఆర్టీసీ సికింద్రాబాద్ డీవీఎం అపర్ణ కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement