Thursday, December 12, 2024

TG | శ్రీచైతన్య స్కూల్‌లో యాసిడ్‌ కలకలం.. 50 మందికి అస్వస్థత

హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య విద్యా సంస్థాన్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్‌లో శ్రీ చైతన్య స్కూల్‌లో దాదాపు 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. యాసిడ్ వాసన పీల్చడంతో కారణంగా విద్యార్థులకు కళ్లు మంటలు, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి కావడంతో పాటు రక్తపు వాంతులు చేసుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

దీంతో అప్రమత్తమైన పాఠ‌శాల‌ యాజమాన్యం.. తల్లిదండ్రులకు తెలియకుండా విద్యార్థుల‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించి చికిత్స అందించడంతో చిన్నారులకు ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో పెద్ద ఎత్తున క్యాంపస్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు.

లక్షల్లో ఫీజులు కట్టి తమ పిల్లలను స్కూల్లో జాయిన్‌ చేస్తే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అంటూ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు నిలదీశారు. చైతన్య స్కూల్‌ యాజమాన్యం పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్కూల్‌ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టడంతో హుటా హుటిన స్కూల్లో ఉన్న స్టూడెంట్స్‌ను స్కూల్‌ సిబ్బంది ఇంటికి పంపించేశారు.

అసలేం జరిగింది…

శ్రీ చైతన్య స్కూల్‌లో రోజు మాదిరిగానే శనివారం ఉదయం 10 గంటలకు మరుగుదొడ్లను యాసిడ్ వేసి శుభ్రం చేస్తున్నారు. ఇందులో భాగంగా మూడో అంతస్తులో ఉన్న బాత్రూం క్లీన్‌ చేస్తున్న సమయంలో యాసిడ్‌ బాటిల్‌ కింద పడి పగిలిపోయింది. అయితే అదే సమయంలో 7,8 తరగతులకు చెందిన విద్యార్థులు అల్పహారం తింటున్నారు. యాసిడ్‌ వాసనలతో పాటు పొగలు ఒక్కసారిగా గదిని కమ్ముకున్నాయి.

- Advertisement -

దీంతో ఊపిరి ఆడక దాదాపు 50 మంది విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకున్నారు. అప్రమత్తమైన స్కూల్‌ యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియకుండా అస్వస్థతకు విద్యార్థులను సమీపంలోని ప్రాణధారా, పల్స్‌ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. ఒక్కసారిగా ఘాటైన వాసనలు రావడంతో విద్యార్థులు కళ్ల మంటలు, ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరయాయ్యారని, యాసిడ్‌ ఘాటును తట్టుకోలేక కొంతమంది విద్యార్ధులు రక్తపు వాంతులు చేసుకు న్నారని వైద్యులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement