జూబ్లీహిల్స్, ప్రభన్యూస్: వర్షాల కారణంగానో, మరే ఇతర కారణాల వల్లనో నీటితో నిండిపోతున్న గుంతలు గత కొంత కాలంగా చిన్నారుల పాలిట శాపంగా మారుతున్నాయి. నీటి గుంతల ఏర్పాటుకు కొన్నిసందర్భాల్లో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఒకటైతే, మరి కొన్ని సందర్భాల్లో ఇతర కారణాలు అవుతున్నాయి. ఏది ఏమైన్నప్పటికీ చిన్నారుల మృతి వారి తల్లితండ్రులకు తీరని కడుపుకోతను మిగిలిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం సికింద్రాబాద్ కళాసిగూడలోని నాలాలో చిన్నారి మౌనిక మృతి చెందిన ఘటన మరువకముందే నగరంలో మరో ఘటన జరగడం కలకలం రేపుతోంది.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు వివేక్ మృతిచెందాడు. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బతుకుదెరువు కోసం వివేక్ కుటుంబం ఏడేళ్ల క్రితం కాకినాడ నుంచి హైదరాబాద్కు వలస వచ్చింది. వివేక్ తండ్రి భీమాశంకర్ ఇంటి పక్కనే ఉన్న ఓ బైక్ షోరూంలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.