మణికొండ, జూన్ 1(ప్రభ న్యూస్): మణికొండ మునిసిపాలిటీ పరిధి అల్కాపురి టౌన్ షిప్ రోడ్ నెంబర్ 13లో శనివారం నిర్మాణంలో ఉన్న భారీ భవనం కూలింది. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. రోడ్ నెంబర్ 13లో ఈ ఘటన జరిగింది. భవనం తాలూకు నిర్మాణ సామాగ్రి 11 కేవీ విద్యుత్తు స్తంభాలు, తీగల సమీపంలో పడ్డాయి. కాస్త అటు ఇటు అయినా ప్రమాదం చాలా తీవ్రంగా ఉండేది.
ఆర్ఆర్ మాల్ పేరిట రోడ్ నెంబర్ 13లో ఈ నిర్మాణం చేపట్టారు. మూడో ఫ్లోర్ ప్రస్తుతం నిర్మాణం జరుగతోంది. ఈ ఫ్లోర్ లోని కొంత భాగమే కూలింది. అయితే, ఈ మాల్ ను ఇంకా ఎన్ని ఫ్లోర్ లు నిర్మిస్తారో తెలియాల్సి ఉంది. నిర్మాణంలో ఉండగానే అకస్మాత్తుగా కొంత భాగం కూలడంతో స్థానికులు భయాందోళలనకు గురయ్యారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని వ్యాఖ్యానించారు. పూర్తిస్థాయి అయి ఉంటే.. తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.