తెలంగాణ సాహిత్యానికి, సాహితి సమరానికి నిలువెత్తు నిదర్శనం కాళోజి అని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. ప్రజాకవి శ్రీ కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… అందుకే ఆయన జన్మదినమైన ఈ రోజు ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి జరుపుకుంటున్నామన్నారు.
తన కవితలు, సాహిత్యం ద్వారా లక్షల మెదళ్లను కదిలించి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపడమే గాక రాజకీయ, సాంఘీక చైతన్యం తీసుకువచ్చి, ప్రశ్నించడం నేర్పించిన వ్యక్తి కాళోజి అన్నారు. అతి సామాన్యునికి సైతం అర్ధమయ్యే రీతిలో సాహిత్యం రచించాడని, వారి రచనలు అందరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజి నారాయణ రావు అని, పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిదని నమ్మి ఆచరించిన వ్యక్తి కాళోజి అన్నారు.